నేటి నుంచి శ్రీవారి దర్శనం

11 Jun, 2020 03:55 IST|Sakshi
అలిపిరి బాలాజీ బస్టాండ్‌ వద్ద గురువారం శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం క్యూలో భక్తులు

భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాకే అనుమతి  

భౌతిక దూరం తప్పనిసరి.. 

ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ 

సింహాచలం, దుర్గగుడిలో ఇప్పటికే దర్శనాలకు అనుమతి

తిరుమల/సింహాచలం/సాక్షి, విజయవాడ: తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం భక్తులకు గురువారం నుంచి లభించనుండగా.. సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి, విజయవాడలోని దుర్గగుడి దర్శనాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆయా ఆలయాల్లో భక్తులు భౌతికదూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకున్నారు. క్యూల ప్రవేశ మార్గాల వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేశారు. దుర్గగుడిలో రోజూ ఐదారు వేల మంది భక్తుల్ని అనుమతించేందుకు ఏర్పాట్లు చేసినా తొలిరోజు బుధవారం 1321 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కొండ దిగువనే భక్తులకు థర్మల్‌స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాకే కొండపైకి అనుమతిస్తున్నారు. పంచాయతీరాజ్‌ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావులు అమ్మవార్ని దర్శించుకున్నారు.  

తిరుమలలో రోజూ 300 మంది భక్తులకు కరోనా పరీక్షలు
► తిరుమలలో మూడు రోజుల పాటు టీటీడీ ప్రయోగాత్మకంగా దర్శనాలు ఏర్పాటు చేసింది. తొలి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులను, బుధవారం స్థానికులను దర్శనానికి అనుమతించింది. లోటుపాట్లను పరిశీలించి గురువారం నుంచి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనుంది. 

► గురువారం ఉదయం 6.30 నుంచి ఏడు గంటల వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ దర్శనం ముగిసిన వెంటనే సామాన్య భక్తులను అనుమతిస్తారు. 

► శ్రీవారి దర్శనానికి అనుమతి ఉన్నట్టుగా టోకెన్‌ను చెకింగ్‌ పాయింట్‌ వద్ద చూపాకే భక్తులను అలిపిరిలోకి అనుమతిస్తారు. 

► ఆ తర్వాత థర్మల్‌ స్క్రీనింగ్, పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేశాకే తిరుమలకు అనుమతిస్తారు. 

► రోజూ ర్యాండమ్‌గా సుమారు 300 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. 

► టికెట్‌తో పాటు వారికి గదిని కేటాయించే సదుపాయాన్ని కల్పించారు. గదికి ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు.  

మరిన్ని వార్తలు