చీర వివాదంపై మల్లగుల్లాలు

7 Aug, 2018 13:05 IST|Sakshi
ఏఈవో అచ్యుతరామయ్యకు ఫిర్యాదు చేస్తున్న ఉండవల్లికి చెందిన భక్తులు

దుర్గగుడికి ఏఈవోకు భక్తులు ఫిర్యాదు

చీర మాయం వ్యవహారం సరిచేయాలని మంత్రి ఫోన్‌ కాల్‌

రంగంలోకి దిగిన అర్బన్‌ నేతలు

పోలీసులకు ఫిర్యాదు చేయమన్న చైర్మన్‌

సాక్షి,విజయవాడ: వివాదాల కేంద్రంగా ఇంద్రకీలాద్రి మారింది. అమ్మ సన్నిధిలో ఎవరికివారే అందినకాడికి దోచేసుకుంటున్నారు. తాజాగా ఉండవల్లికి చెందిన భక్త బృందం సమర్పించిన ఖరీదైన పట్టుచీర మాయం వ్యవహారంపై ట్రస్టుబోర్డు సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ వ్యవహారం నుంచి ఎలా తప్పించుకోవాలో అని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
చీర మాయమైన సమయంలో అక్కడే పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత ఉండటం, ఆమె చీర తీసుకువెళ్లిందంటూ అర్చకుడు శంకర శాండిల్య వెల్లడించడం పాలకమండలి సభ్యులకు మింగుడుపడటం లేదు. అమ్మవారికి చెందాల్సిన చీరను పాలకమండలి సభ్యురాలు తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని, దేవాలయం ముందు ధర్నా చేస్తామని దాతలు బహిరంగంగానే ప్రకటించారు.

సీఎం దృష్టికి వివాదం
దుర్గమ్మ చీర మాయమైన విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. పార్టీ ప్రతిష్ట మంటగలుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈలోగా పాలకమండలి సభ్యురాలుకు తెలిసిన క్యాబినేట్‌లో కీలకంగా ఉండే ఒక మంత్రి అర్బన్‌ నేతలకు ఫోన్‌ చేసి ఈ వ్యవహారం అంతా సరిచేయాలంటూ సూచించారు. దీంతో సోమవారం రాత్రి అర్బన్‌ తెలుగుదేశం నేతలు రంగంలోకి దిగి అటు పాలకమండలితోనూ, ఇటు దేవస్థానం అధికారులతోనూ, పోలీసులతోనూ మాట్లాడుతున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది.

మంటగలుస్తున్న ప్రతిష్ట
పాలకమండలి సభ్యులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఇటు పాలకమండలి, అటు దేవస్థానం ప్రతిష్ట మంటగలుస్తోంది. ఇటీవల నాయీ బ్రాహ్మణుడిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య దాడి చేశారు. ఈ ఘటన మరిచిపోకముందే సూర్యలత చీర మాయం చేసిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజా వ్యవహారంలోనూ పెంచలయ్య రంగంలోకి దిగి చీరను సమర్పించిన భక్తులు పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. భక్తుడు సూర్యనారాయణ ఉండవల్లికి చెందిన వారు కావడంలో అదే ప్రాంతానికి చెందిన పెంచలయ్య వారిని అడ్డుకుంటున్నారు. ఏదో విధంగా పోలీసు కేసు నమోదు కాకుండా కేసును పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే భక్తులు పట్టుబట్టడంతో సాయంత్రం దుర్గగుడి ఏఈవో అచ్యుతరామయ్యకు ఫిర్యాదు చేయనిచ్చారు. అదే సమయంలో తమ ప్రతిష్ట కాపాడుకునేందుకు పాలకమండలి తరుఫున బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలంటూ ఏఈవోకు ఒక లేఖఇచ్చినట్లు పాలకమండలి సభ్యులు చెబుతున్నారు.  పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాకుండా తామే విచారణ చేసి కేసును పరిష్కరిస్తామంటూ చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు చెబుతున్నారు. పోలీసు స్టేషన్‌ వరకు కేసును తీసుకు వెళ్లిన తరువాత కేసు మాఫీ చేయడమా? లేక పోలీసుల దాకా వెళ్లకుండానే వివాదం పరిష్కరంచమా అనే విషయం పై సోమవారం రాత్రి వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు