భక్తులతో పోటెత్తిన శివాలయాలు

4 Nov, 2013 08:12 IST|Sakshi

హైదరాబాద్ : పరమ శివుడికి అత్యంత ప్రియమైనది కార్తీక మాసం. తొలి కార్తీక సోమవారం రోజు రాష్ట్రంలోని శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే  భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడికి పూజలు చేశారు. హైదరాబాద్‌లో శివాలయాలు కిక్కిరిసిపోయాయి.

కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తొలిరోజే సోమవారం కావడంతో శివాలయలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా మహాశివుని దర్శనానికి క్యూ కట్టారు.   సోమవారమంటే మహాదేవునికి మహా ప్రియం అందులోనూ ఈసారి విశేషించి సోమవారంనాడే ఈ మాసం ప్రారంభమైంది.

ఈ మాసమంతా శివారాధనా, ఉపవాసం చెయ్యలేనివారు కేవలం ఈ ఒక్క సోమవారంనాడైనా నిండుమనస్సుతో చెయ్యగలిగితే వారు తప్పక కైవల్యాన్ని పొందుతారు. ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా శివదేవునికి అభిషేకం, అర్చనలు చేసినవారు వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు.

మరోవైపు శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాదేవుడిని దర్శించుకుని అనుగ్రహం పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.మరోవైపు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మహిళలు నదిలో దీపాలు వదలి దీపారాధన చేశారు.

మరిన్ని వార్తలు