అన్నమయ్య మార్గానికి మహర్దశ

11 Sep, 2015 02:38 IST|Sakshi
అన్నమయ్య మార్గానికి మహర్దశ

అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పురాతన అన్నమయ్య మార్గానికి అనుసంధానంగా ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించింది. బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది.  

తిరుమల: అన్నమయ్య మార్గానికి అనుసంధానంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగంగా సాగుతున్నాయి. అలిపిరి కాలిబాట మార్గంలో తిరుమలకు రోజుకు 10 నుంచి 20 వేల మంది భక్తులు వస్తుంటారు. తిరుమల శనివారాలు, వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఆ సంఖ్య యాభైవేలు దాటుతుంది. అవ్వాచ్చారి కోన వద్ద రోడ్డు చాలా ఇరుకుగా ఉండడంతో వాహన ప్రమాదాల్లో భక్తులు తీవ్రంగా గాయపడుతుంటారు. ఇక్కడే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటి నివారణలో భాగంగా ఎగువ మార్గాన 1.5 కి.మీ దూరంలో ఉన్న పురాతన అన్నమయ్య కాలిబాట మార్గాన్ని అధునాతనంగా పునరుద్ధరించారు. ఐదేళ్లకు ముందు రూ.2 కోట్లతో 680 మీటర్ల మేరకు గ్రానైట్ బండరాళ్లను పరిచారు. 2012లో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా టీటీడీ అధికారులు హడావిడిగా ప్రారంభోత్సవం చేశారు.

ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు విస్తరణ
రూ.6 కోట్ల అంచనాలతో పనులు మొదలుపెట్టి రూ.2 కోట్లతో అన్నమయ్య పురాతన మార్గాన్ని అభివృద్ధి చేశారు. మిగిలిన రూ.4 కోట్లతో అక్కడి నుంచి మోకాళ్ల పర్వతం వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అవ్వాచ్చారి కోన ప్రాంతంలోని ఇరుకైన రోడ్డు విస్తరణ పనులు కొనసాగించాల్సి ఉంది. దీనిపై టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు సమీక్షించి మలిదశ పనులకు అనుమతి ఇచ్చారు. తొలి విడతగా రూ.30 లక్షలతో పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించారు. ఇందుకు అనువుగా కొంత రోడ్డును విస్తరించారు. బ్రహ్మోత్సవాలకు ఈ మార్గాన్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు అధికారులు పనులు వేగంగా చేస్తున్నారు.

 శ్రీవారికి రూ.31 లక్షల విరాళం
 సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారికి గురువారం రూ.31 లక్షలు విరాళం గా అందింది. ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు చెన్నైకు చెందిన డి.శ్రీనివాస్ రూ.25 లక్షలు ఇచ్చారు. నిత్యాన్నప్రసాదం ట్రస్టుకోసం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పల్లంరాజు సుబ్బారావు రూ.లక్ష, హైదరాబాద్‌కు చెందిన కె.రామకృష్ణ రూ.2లక్షలు, బ్రిటన్‌కు చెందిన ప్రవాస భారతీయురాలు కె.నిత్య రూ.లక్ష, విజయవాడకు చెందిన అప్పారావు రూ.లక్ష, శ్రీనివాస్ చక్రవర్తి రూ.లక్ష అందజేశారు.

మరిన్ని వార్తలు