పోటెత్తిన తిరుమల

16 Jan, 2014 04:03 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 40,345 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనం భక్తులకు 15 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. రద్దీ పెరగటంతో రూ.300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 2గంటలకు నిలిపివేశారు. కాలిబాట భక్తులకు 6గంటల తర్వాత దర్శనం లభించనుంది.
 
 శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు
 రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సతీసమేతంగా బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయంలో అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఈసారి రైతులకు పంట దిగుబడి ఎక్కువగా రావాలని, ఆహార ధాన్యాలకు ఎటువంటి కొరత లేకుండా ఉండాలని గవర్నర్ నరసింహన్ అన్నారు.

 నేడు శ్రీవారి పారువేట ఉత్సవం
 సాక్షి, తిరుమల: తిరుమలలో గురువారం పారువేట ఉత్సవం నిర్వహించనున్నారు. శ్రీనివాసుడు పంచాయుధాలైన శంఖు, చక్ర, గద, ధనుః, ఖడ్గాలను ధరించి వన విహారార్థం వెళ్లి దుష్ట మృగాలను వేటాడి విజయగర్వంతో తిరిగిరావటమే ఈ ఉత్సవ విశిష్టత. ఏటా కనుమ పండుగ రోజు శ్రీవారు పారువేటకు వెళ్తారు. అలాగే, తాయార్లు, మలయప్ప మధ్య వినోద భరితంగా సాగే ప్రణయ కలహోత్సవాన్నీ గురువారం నిర్వహించనున్నారు.
 
 వేటకు వెళ్లి వచ్చిన శ్రీవారిని చూసి అమ్మవార్లు కోపగించడం, శాంతించవలసిందిగా అమ్మవార్లను స్వామి ప్రార్థించడం అత్యంత భక్తిరస భరితంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదానికి ఆరో రోజున తిరుమలలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం నుంచి సుప్రభాత సేవను పునఃప్రారంభించారు. ధనుర్మాసంలో సుప్రభాత సేవ కు మారుగా తిరుప్పావై పఠించారు.

మరిన్ని వార్తలు