కోదండరాముడికి కొండంత భక్తితో..

23 Jun, 2014 03:32 IST|Sakshi
కోదండరాముడికి కొండంత భక్తితో..

 నరసాపురం (రాయపేట) : కోదండ రాముడికి.. కొండంత భక్తితో నరసాపురానికి చెందిన ఓ మహిళ రాములోరిపై భక్తిభావాన్ని చాటిచెబుతూ బియ్యపు గింజలపై శ్రీరామనామ లేఖనం చేపట్టారు. శ్రీరాముడిపై భక్తిభావాలను తెలియజేస్తూ రోజుకు ఎనిమిది గంటల పాటు వెయ్యి బియ్యపు గింజలపై రామనామాన్ని లిఖిస్తోంది.
 
పట్టణానికి చెందిన కోట్ల రాజా కిరణ్మయి బియ్యపు గింజలపై శ్రీరామ కోటిని రాస్తున్నారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణంలో తలంబ్రాలు పోయించే దృశ్యాన్ని చూసి భక్తి పరవశమయ్యానని కిరణ్మయి తెలిపారు. శ్రీరామ నామాన్ని రాసిన బియ్యపు గింజలను తలంబ్రాలుగా వినియోగిస్తే బాగుంటుందనే ఆలోచన మనసుకు తట్టిందన్నారు. ఆ ఆలోచనకు కార్యాచరణ చేపట్టినట్టు ఆమె చెప్పారు.  ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని రాయడం ప్రారంభించానన్నారు.

ఇందుకోసం పీఎల్ మసూరి రకం బియ్యాన్ని వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఎటువంటి పనిముట్లు లేకుండా రెండు వేళ్ల మధ్య మూడు, నాలుగు బియ్యపు గింజలను గట్టిగా పట్టుకుని స్కెచ్ పెన్‌తో శ్రీరామ నామాన్ని రాస్తున్నట్లు వివరించారు. ఇప్పటికి దాదాపు 60 వేల గింజలపై లిఖించినట్టు చెప్పారు. వచ్చే సీతారాముల కల్యాణానికి శ్రీరామనామం రాసిన లక్షా 108  బియ్యపు గింజలను భద్రాచలంలోని స్వామి వారికి తలంబ్రాలుగా వినియోగించేందుకు దేవాదాయ శాఖ అధికారుల అనుమతి కోసం అర్జీ పెట్టుకున్నానని కిరణ్మయి పేర్కొన్నారు. అంతేగాక అయోధ్యలో వీటిని ప్రదర్శించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు  తెలిపారు. ఆమెను పలువురు అభినందిస్తున్నారు. ఆమె చేపట్టిన ఈ భక్తి కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు