'సూటి మాట’ ఆవిష్కరణ

29 Jul, 2017 13:18 IST|Sakshi
'సూటి మాట’ ఆవిష్కరణ
విజయవాడ: రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాజకీయాల విశ్లేషణపై సీనియర్‌ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ రాసిన సూటి మాట పుస్తకాన్ని జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆవిష్కరించారు. చరిత్రకు సాక్ష్యాధారాలుగా అమర్ రాసిన పుస్తకం పనికి వస్తుందని వక్తలు కొనియాడారు. రాష్టానికి సంబంధించిన వివిధ సంఘటలను కళ్ళకు కట్టినట్లు పుస్తకంలో వివరించారని, పత్రికల్లో సంపాదకీయం రాయడం కొంతమందికి మాత్రమే సాధ్యమని, వారిలో అమర్ ఒకరని అన్నారు. పేరుకు తగ్గట్టుగానే పుస్తకంలో అమర్‌ అన్ని విషయాలు సూటిగా రాశారన్నారు. విభజన తరువాత రెండు రాష్ట్రాల ఆర్థిక విధానాల్లో పెద్దగా మార్పు లేదనన్నారు.
 
ప్రధానంగా ప్రజా సమస్యలపై మీడియా దృష్టి సారించాలన్నారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ తనకు అమర్‌తో 32 ఏళ్ల పరిచయం ఉందని, ఏదైనా సూటిగానే కాదు కర్కశంగా కూడా చెబుతారని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సాక్షి, ఈనాడు పేపర్లు చదువుతానని, ఈ రెండు పేపర్లు చదివితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. జర్నలిజం ప్రజాహితాన్ని కోరాలన్నారు. మనం ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాం అన్నది ఆలోచించాలి అని సూచించారు.
 
రాజకీయాల్లో అసహనం పెరిగిపోయింది: అమర్‌
పాతికేళ్లుగా కాలమ్స్ రాస్తున్నానని, మధ్యలో ఐదు సంవత్సరాలు ప్రెస్ అకాడమి ఛైర్మన్‌ గా ఉన్నప్పుడు మాత్రమే కాలమ్స్ రాయలేదని, సీనియర్‌ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి ప్రోత్సహంతోనే రెండవసారి కాలమ్స్ మొదలుపెట్టానని అమర్‌ చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో అసహనం పెరిగిపోయిందని, తాము తప్ప రాజకీయాల్లో ఎవరూ ఉండకూడదనే భావన పెరిగిపోయిందని అన్నారు. సమాజానికి రాజకీయ, న్యాయ వ్యవస్థ ఎంత అవసరమో మీడియా కూడా అంతే అవసరమన్నారు. మీడియాను అణగదొక్కాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అయితే వారికి అది కుదరడం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ పక్షాల్లో పెరిగిన అసహనం కారణంగానే కాలమ్స్ రాస్తున్నానంటూ ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు ప్రజలు ఎప్పటికీ కలిసే ఉండాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ సచివాలయాన్ని పాడు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.