సంచలన కేసులను చేధించిన సిబ్బందికి అవార్డులు!

29 Jul, 2019 16:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: విధుల్లో అప్రమత్తంగా ఉంటూ గత మూడు నెలల్లో సంచలన కేసులను చేధించిన సిబ్బందికి అవార్డులు ప్రకటించామని, ఈ యేడాది రెండో త్రైమాసిక సంవత్సర అవార్డులను ఈరోజు అందిస్తున్నామని డీజీపీ గౌతం‌ సవాంగ్ పేర్కొన్నారు. సిబ్బందిని గుర్తించడంతో పాటు, మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులు అందజేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మొదటి అవార్డు విశాఖ టౌన్, రెండో అవార్డు విజయనగరం వన్ టౌన్ పీఎస్ కు రాగా, మూడో అవార్డు కడప జిల్లా రైల్వే కోడూరులకు అవార్డులు వచ్చాయి. 

కడప జిల్లా రైల్వే కోడూరులో షేక్ అబ్దుల్ ఖదీర్ అనే యువకుడి హత్య కేసు మిస్టరీ చేధనకుగాను మూడో స్థానం లభించగా, విజయనగరం వన్ టౌన్ పీఎస్ పరిధిలోలో నకిలీ  లైసెన్స్, ఆర్సీ బుక్ లతో  పేపర్ మెటీరియల్ ఉన్న లారీని చోరీ చేసి అమ్ముకున్న కేసును చేధించిన సిబ్బందికి రెండో అవార్డు వచ్చింది. విశాఖ సిటీ పీఎస్ పరిధిలో ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, బండారు సత్యనారాయణలకు సీఎం పర్సనల్ సెక్రటరీ పేరుతో ఫేక్ కాల్ చేసి డబ్బులు దోచుకొని చిక్కకుండా ఉండేందుకు ఇంటర్నేషనల్‌ వాట్సప్ కాల్స్ చేసి మాట్లాడారు. మొబైల్ కాల్స్కు దొరకకుండా స్పూఫింగ్‌ చేసినా... టెక్నాలజీ, ఐపీ అడ్రస్ల ఆధారంగా ఈ కేసును చేధించినందుకుగాను విశాఖ టౌన్ పోలీసులకు మొదటి అవార్డును ప్రకటించారు.

ఇటువంటి కేసుల వివరాలపై మీడియాలో  విస్తృత కవరేజి ఇవ్వాలని, కొత్త కొత్త మోసాల పై అప్రమత్తంగా ఉండేలా ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలని ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు