అనారోగ్యంతో ఉన్న పోలీసులకు విధులొద్దు

30 Mar, 2020 05:02 IST|Sakshi

పోలీస్‌ అధికారులకు డీజీపీ ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనారోగ్యంతో ఉన్న వారికి లాక్‌డౌన్‌ విధులు అప్పగించవద్దని పోలీస్‌ అధికారులకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అదివారం రాత్రి ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో 55 సంవత్సరాలు పైబడిన పోలీస్‌ సిబ్బందికి లాక్‌ డౌన్‌ డ్యూటీ వేయొద్దని ఆదేశించారు. హృద్రోగ, శ్వాస, మధుమేహం వంటి సమస్యలతో ఉన్నవారిని క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచాలన్నారు. అటువంటి వారికి పోలీస్‌ స్టేషన్, ఆఫీస్, కంట్రోల్‌ రూంలలో మాత్రమే విధులు కేటాయించాలని చెప్పారు. 

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఐఏఎస్‌ల 3 రోజుల వేతనం
కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా విపత్కర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం కోసం 3 రోజుల వేతనం ఇస్తున్నట్లు ఐఏఎస్‌ అధికారుల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఆ సంఘం జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ప్రతి ఐఏఎస్‌ అధికారి మూడురోజుల వేతనం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏడుగురు ఐఏఎస్‌ అధికారులకు సూపర్‌స్కేల్‌
ఏపీ కేడర్‌ 2004 బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐఏఎస్‌ అధికారులకు సూపర్‌ టైమ్‌ స్కేల్‌ను ఇస్తూ సీఎస్‌ నీలంసాహ్ని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో భాస్కర్‌ కాటమనేని, పీఎస్‌.ప్రద్యుమ్న, ఐ.శామ్యూల్‌ కుమార్, హెచ్‌.అరుణ్‌కుమార్, ఎం.పద్మ, పి.ఉషాకుమారి, శోభ ఉన్నారు.

మరిన్ని వార్తలు