ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి

24 Mar, 2020 18:15 IST|Sakshi

రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు రోడ్లపైకి అనుమతించం

ఉదయం 6 నుంచి 8 గంటల వరకే నిత్యావసరాలకు అనుమతి

అవసరం లేకుండా రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తాం

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

సాక్షి, విజయవాడ: వ్యక్తిగత భద్రత సామాజిక బాధ్యత అని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ కట్టడికి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణకు చాలా అప్రమత్తంగా ఉన్నామని.. రాబోయే రోజుల్లో మరింత సీరియస్‌గా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. కొంతమంది పరిస్థితులను అర్థం చేసుకోకుండా పోలీసులను ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజల భద్రత కోసమే పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రోడ్లపైకి అనుమతించమని డీజీపీ స్పష్టం చేశారు.
(‘చంద్రబాబూ.. కరోనాపై రాజకీయాలు మానుకో’)

ఉదయం 6 గంటల నుంచి 8 వరకే నిత్యావసర వస్తువుల కోసం అనుమతిస్తామని వెల్లడించారు. ఆటో, ఫోర్ వీలర్స్‌లో అత్యవసర సేవల కోసం ఇద్దరికి మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. బీ హోమ్‌-బీ సేఫ్‌ అనేది పోలీసు శాఖ విజ్ఞప్తి అని పేర్కొన్నారు. పోలీసుల సూచనలను ప్రజలు కచ్చితంగా పాటించాల్సిందేనని.. అవసరం లేకుండా రోడ్లపై తిరిగితే వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని డీజీపీ హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా సమాచారం ఇవ్వాలని.. వివరాలు దాస్తే కేసులు పెడతామని డీజీపీ గౌతం సవాంగ్‌ స్పష్టం చేశారు.
(భారీ ఊరట : త్వరలో మహమ్మారి తగ్గుముఖం) 

మరిన్ని వార్తలు