'వెంకటాపురం గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించాం'

7 May, 2020 12:38 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..'ఈ ఘటన ఉదయం 3.30గంటల ప్రాంతంలో జరిగింది.  సంఘటన సమయంలో ఫ్యాక్టరీలో 15 మంది ఉన్నట్లు సమాచారం. డయల్ 100 కి ఫోన్ వచ్చింది. సమాచారం అందగానే పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి అధికార యంత్రాంగం కూడా సైరన్‌ ద్వారా అప్రమత్తం చేసింది. ఇళ్లలోంచి బయటకు రావాలని కూడా మైక్ ద్వారా చెప్పారు. జిల్లా కమిషనర్ ఆర్‌.కె.మీనా ఘటన జరిగిన ప్రాంతానికి ఉదయం 4.30 సమయంలో వెళ్లారు. గ్యాస్‌ లీకేజీ ప్రమాదంతో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. ఉదయం 5.30 గంటలకు ఫ్యాక్టరీలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వెంకటాపురం గ్రామాన్ని ఉదయం 6.30 గంటల కల్లా పూర్తిగా ఖాళీ చేయించాం. ఇళ్లల్లో ఉన్నవారిని డోర్‌లు పగలగొట్టి బయటకు తీసుకొచ్చాం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. (విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

గాలిలో కూడా వాటర్ స్ప్రే చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఉదయం నుంచి ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 800 మందికి పైగా ఆస్పత్రులకు తీసుకెళ్లాము..వారిలో ప్రస్తుతం 250 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. ఒక ట్యాంక్‌లో స్టైరిన్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే గ్యాస్‌ లీకేజీ అయిన సమయంలో న్యూట్రలైజ్ కూడా పక్కనే ఉంది...కానీ వాడకపోవడంపై పలు అనుమానాలున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలానికి విజయవాడ నుంచి ఫోరెన్సిక్ టీమ్‌ను పంపి వివరాలు సేకరిస్తున్నాం.  ప్రస్తుతం మేము వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టామని ' పేర్కొన్నారు. ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సంఘటన నిర్లక్ష్యం వల్లా.. లేక ప్రమాదమా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.
(లీకైన గ్యాస్‌ చాలా ప్రమాదకరం: నిపుణులు)

మరిన్ని వార్తలు