కేసీఆర్‌కు పుట్టగతులుండవ్

2 Mar, 2014 23:36 IST|Sakshi

హన్మకొండ: తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆదివాసీ బిడ్డలను సీమాంధ్రులకు బలిచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పుట్టగతులుండవని ములుగు మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) మండిపడ్డారు. మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ) ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో జరిగిన జలదీక్ష కార్యక్రమానికి ఆమె సంఘీభావం తెలిపారు. కాపువాడ శివారులోని భద్రకాళి చెరువు మత్తడి వద్ద ఎంఎస్‌పీ నేతలతో కలిసి చెరువులో దిగి దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ  నెల రోజుల నుంచి రక్షించండని ఆదివాసీలు రోదిస్తున్నా కేసీఆర్‌కు వినిపించ లేదా అని ప్రశ్నించారు. పోలవరం టెండర్లు దక్కించుకున్నందుకే నేడు కేసీఆర్ ఆదివాసీలను ముంచేందుకు సిద్ధపడ్డాడని దయ్యబట్టారు. ఇప్పటికైనా ఆదివాసీల పక్షాన నిలబడకుంటే గిరిజనుల బాణాలకు బలికాక తప్పదని సీతక్క హెచ్చరించారు. ఎంఎస్‌పీ సమన్వయకర్త మంద కుమార్ మాట్లాడుతూ ఒక్క గ్రామాన్ని కూడా వదులు కోవడానికి సిద్ధంగా లేమని ప్రకటించిన కేసీఆర్... 200కు పైగా ఆదివాసీ గ్రామాలు పోలవరంలో మునుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు