చిక్కినట్టే చిక్కి.. అంతలోనే పట్టు తప్పి..

2 Oct, 2019 11:25 IST|Sakshi
బోటు వెలికితీత పనుల్లో ధర్మాడి బృందం

ధర్మాడి బృందానికి సవాల్‌గా మారిన బోటు వెలికితీత

ఐరన్‌ రోప్‌ తెగిపోవడంతో పనులకు అంతరాయం

ఆశ, నిరాశల మధ్య రెండోరోజూ వెతుకులాట

దేవీపట్నం (రంపచోడవరం): కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన ప్రైవేట్‌ టూరిజం బోటు రాయల్‌ వశిష్ట పున్నమిని ధర్మాడి సత్యం బృందం బయటకు తీసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆశనిరాశల మధ్య రెండోరోజు బోటు వెలికితీత పనులు కొనసాగాయి. గోదావరి ప్రవాహం ఉరుకులు తగ్గి సాఫీగా సాగిపోతున్నా కచ్చులూరు మందం నుంచి బోటు వెలికి తీసుకురావడం ధర్మాడి బృందానికి పెనుసవాల్‌గా మారింది. జిల్లా యంత్రాంగం బాలాజీ మెరైన్స్‌ సంస్థకు బోటు వెలికితీత పనులు అప్పగించిన తరువాత రెండో రోజు ఆ బృందం సభ్యులు రంగంలోకి దిగారు.

900 మీటర్ల ఐరన్‌ రోప్‌తో వెలికితీసే ప్రయత్నం
కచ్చులూరు మందంలో గల్లంతైన బోటును వెలికితీసేందుకు ధర్మాడి బృందం సోమవారం రెండు వేల మీటర్ల ఐరన్‌ రోప్‌ను గోదావరిలో బోటు ఉన్న ప్రాంతంగా భావిస్తున్న ప్రాంతంలో వలయకారంలో ఉచ్చుగా చేశారు. ఐరన్‌ రోప్‌ రెండు కొనలను పొక్లెయిన్‌తో లాగే ప్రయత్నం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభించారు. గోదావరి నుంచి ఒడ్డుకు తీసుకువచ్చిన ఐరన్‌ రోప్‌ను సులభంగా లాగేందుకు కప్పీలను అమర్చారు. గోదావరిలో ఐరన్‌ రోప్‌ మునిగిన బోటుకు తగిలింది అనే అంచనాలో బోటు పైకి వస్తుందనే ప్రయత్నాల్లో ఐరన్‌ రోప్‌ ఒక్కసారిగా తెగిపోయింది. పది నిమిషాల పాటు రోప్‌ తెగకుండా ఉంటే గోదావరిలో జత చేసి ఉన్న బలమైన ఐరన్‌ రోప్‌ పొక్లెయిన్‌ లాగే అవకాశం వచ్చేది. ఐరన్‌ రోప్‌ తెగిపోవడంతో ధర్మాడి సత్యం బృందం ప్రయత్నం విఫలమైంది. పొక్లెయిన్‌ లాగేందుకు ఉపయోగించిన ఐరన్‌ రోప్‌ సుమారు 50 టన్నుల బరువును లాగేందుకు ఉపయోగపడుతోంది. గోదావరిలో మునిగిన బోటు 24 టన్నులు కాగా మరో 25 టన్నులు అదనపు బరువును లెక్కించి ఐరన్‌ రోప్‌ను ఉపయోగించినా వారి అంచనా తప్పింది. రోప్‌  బండరాయికు తగులుకోవడంతో తెగిపోయినట్టు సత్యం వెల్లడించారు. అప్పటికే  సమయం మధ్యాహ్నం ఒంటి గంట కావడంతో మరో వ్యూహంతో తమ వద్ద అందుబాటులో ఉన్న 900 మీటర్ల ఐరన్‌ రోప్‌తో ఆపరేషన్‌ తిరిగి ప్రారంభించారు. 900 మీటర్ల ఐరన్‌ రోప్‌కు చివర లంగరు కట్టి బోటు ఉన్నట్టు భావిస్తున్న ప్రాంతంలో వదిలి పెట్టి ఒడ్డుకు ఐరన్‌ తీసుకువచ్చారు. లంగరుకు ఎక్కడా బలమైన వస్తువు తగల్లేదు. ఖాళీ లంగరును బయటకు లాగారు.

కొనసాగనున్న వెలికితీత పనులు
కచ్చులూరు మందం వద్ద మూడో రోజు మునిగిన బోటును వెలికితీసే ప్రక్రియ కొనసాగుతుంది. బాలాజీ మెరైన్స్‌ సంస్థ యాజమాని ధర్మాడి సత్యం మాట్లాడుతూ బోటు ఉన్న ప్రాంతంలో గోదావరిలో దుర్గంధం వస్తోంది. ఐరన్‌ రోప్‌ బండరాయి, బోటుకు కలిపి తగలడంతో రోప్‌ తెగిపోయింది. బోటును వెలికి తీసేందుకు  బుధవారం మరో ప్రయత్నం జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు