'ఏడాది పాలనలో సీఎంగా చంద్రబాబు విఫలం'

8 Jun, 2015 19:14 IST|Sakshi

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో సీఎంగా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వైఎస్సార్సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇవ్వజూపి పక్కాగా దొరికిపోయి కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించడం హాస్యాస్పదమన్నారు. బాబు నీతిమంతుడైతే సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ధర్మాన డిమాండ్‌ చేశారు. రాజధాని నిర్మాణం కోసం చేసిన భూమిపూజకు ప్రతిపక్షాలను పిలవకుండా తన కుటుంబ వ్యవహారంలా చంద్రబాబు వ్యవహరించడం దారుణమన్నారు.

దొంగల పార్టీ ఎవరిదో ఇప్పటికే బయటపడిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీలో బొత్స చేరికపై విమర్శించే స్థాయి అచ్చెన్నకు లేదన్నారు. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టారని, ఇపుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం 'గురివిందగింజ' సామెతలా ఉందని ధర్మన కృష్ణదాస్ విమర్శించారు.

మరిన్ని వార్తలు