‘బాబు తప్పిదాల వల్లే ఈ ప్రమాదం’

10 May, 2020 12:30 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ప్రమాద స్థలంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి మంత్రుల బృందంతో సమామేశమై తాజా పరిణామాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. సాయంత్రానికి 48 గంటల పూర్తవుతున్ననేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు ఐదు గ్రామాల ప్రజలను వెనక్కి పంపించే విషయమై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. (చంద్రబాబు హయాంలో రూ. కోటి పరిహారం ఇచ్చారా? )

ప్రస్తుతం స్టైరిన్ అదుపులోకి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లడం దారుణమని ధర్మాన కృష్ణదాస్‌ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఎల్‌జీ పాలిమర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగినపుడు ఏం చర్యలు తీసుకున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతులు ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. సింహాచలం దేవస్ధానం భూములను సైతం డీనోటిఫై చేయలేదా అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండానే ఫ్యాక్టరీ విస్తరణకు మీరు ఎలా అనుమతులిచ్చారని ధర్మాన కృష్ణదాస్‌ ధ్వజమెత్తారు. (బాబు నిర్వాకం.. విశాఖకు శాపం)

చంద్రబాబు తప్పిదాల వల్లే ఈ రోజు ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ప్రమాదం జరిగి ఉండేది‌ కాదని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. చంద్రబాబు తప్పు చేసి తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో ఏ నాయకుడు స్పందించని విధంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి రూ.కోటి నష్ట పరిహారం ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. రూ.30 కోట్లు విడుదల చేస్తూ జీఓ కూడా జారీ చేశామని ఆయన తెలిపారు.

సీఎం వైఎస్ జగన్ చర్యలపై ప్రతిపక్షాలన్నీ అభినందించినా చంద్రబాబు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. చంద్రబాబు కుటిల రాజకీయాలు జుగుప్సాకరంగా ఉన్నాయని మంత్రి మండిపడ్డారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా పలు కమిటీలు వేశామని ఆయన తెలిపారు. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ స్పష్టం చేశారు. అన్ని కమిటీల సూచనలతో భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా