ప్రజాబలం లేదని ఒప్పుకున్నట్లే

6 Sep, 2017 04:31 IST|Sakshi
ప్రజాబలం లేదని ఒప్పుకున్నట్లే

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో టీడీపీకి ప్రజాబలం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో చెప్పకనే చెప్పారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తమ పరిపాలనపై ప్రజలు సంతృప్తితో లేరని చంద్రబాబే చెప్పుకున్నారన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో అధికారపక్షం విజయం సాధిస్తే అభివృద్ధి కార్యక్రమాలను చూసో, సంక్షేమ పథకాలను చూసో ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారని చెప్పుకోవడం గతంలో చూశామని, కానీ, చంద్రబాబు అందుకు భిన్నంగా నంద్యాల ఉప ఎన్నికలో, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలో పబ్లిక్‌ మేనేజ్‌మెంట్, పొలిటికల్‌ మేనేజ్‌మెంట్, పోల్‌ మేనేజ్‌మెంట్‌ అనే మూడు ‘పీ’ల సిద్ధాంతాన్ని అమలుచేసి గెలిచామని ఘనంగా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజాబలంతో గెలిచామని గాకుండా ఇలాంటి మేనేజ్‌మెంట్‌ జిమ్మిక్కులతో గట్టెక్కామని చెప్పడాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు.

రాబోయే ఎన్నికలలో టీడీపీని ఏ పోల్‌ మేనేజ్‌మెంట్‌ రక్షించలేదన్నారు. మరో ఏడాదిలో మునిగిపోయే టీడీపీ నావ ఎక్కేందుకు ఎవ్వరూ సాహసం చేయరని ధర్మాన చెప్పారు. అప్రజాస్వామిక విధానాలు, మోసపూరిత హామీలతో ఓటర్లను మభ్యపెట్టినా నంద్యాలలో 70 వేల ఓట్లు తెచ్చుకున్న వైఎస్సార్‌సీపీని చంద్రబాబు ఏమీ చేయలేరని చెప్పారు. టీడీపీ ప్రజాబలం తెలుసుకోవాలంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమవ్వాలని సవాల్‌ విసిరారు. నంద్యాల, కాకినాడలో గెలుపు.. బలం కాదని వాపు మాత్రమేనన్న విషయాన్ని కప్పిపుచ్చు కోవడానికే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.