పైసలే పరమావధి... ఖాకీ బెదిరింపులు

22 Nov, 2017 20:23 IST|Sakshi

ధర్మవరం పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ తీరుతో విసిగిపోతున్న చేనేత వ్యాపారులు

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వెనక్కి తగ్గని వైనం

బెదిరింపులతో హడలెత్తిస్తున్న ఖాకీ

సాక్షి, అనంతపురం : ధర్మవరం పట్టణంలో పోలీసుల బెదిరింపులు కొత్తమీకాదు. చిన్నపాటి విషయాలను సైతం పెద్దవి చేస్తూ డబ్బు దండుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఓఎస్‌ఐ పనితీరు పోలీసు ఉన్నతాధికారులు సైతం తలదించుకునేలా చేస్తోంది. అయితే ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే ఆయన ఎస్‌ఐ భాగోతం ఉన్నతాధికారులకు తెలిసినా మార్పు రాకపోవడం. ఎస్‌ఐ ఫోన్‌లో బెదిరించడం మొత్తం రికార్డు చేసిన బాధితుడు దానిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసినా ఎస్‌ఐలో మార్పు రాలేదు. తన వేధింపులు యథావిధిగా కొనసాగిస్తూ వచ్చాడు.

అసలు జరిగిందేమిటంటే..
ధర్మవరానికి చెందిన ఓ పెద్ద చేనేత వ్యాపారస్తుడి వద్ద పనిచేసే కార్మికుడు రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. అయితే ఈ ఘటనకు వ్యాపారస్తుడే కారణమంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌లోని ఓఅధికారి వ్యాపారస్తుడిని బెదిరించాడు. నెల రోజులుగా నయానో భయానో సొమ్ము చేసుకోవాలని చూశాడు. ఎలాంటి సంబంధం లేకున్నా రోజూ ఫోన్‌లో బెదిరించసాగాడు. అటు మృతిచెందిన చేనేత కార్మికుని కుటుంబ సభ్యులు ఎవరూ స్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోయినా సదరు పోలీసు అధికారి సుమోటోగా కేసు నమోదు చేస్తానంటూ ఒత్తిడి తీసుకువచ్చాడు. రోజూ తన సిబ్బందిని ఇంటి వద్దకు పంపడం, సెటిల్‌ చేసుకుంటావా లేదా కేసు పెట్టమంటావా అంటూ ఫోన్‌లో బెదిరించడంతో,  సదరు వ్యాపారి దిక్కుతోచక జిల్లా పోలీసు అధికారికి ఫిర్యాదు చేశాడు. అయినా కూడా సదరు పోలీసు అధికారి ఆ వ్యాపారకి ఫోన్‌ చేసి బెదిరించిన తీరు పట్టణంలోని అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఫోన్‌లో వ్యాపారితో ఎస్‌ఐ సంభాషణ వారి మాటల్లోనే ఇలా..

– పోలీసు అధికారి : హలో..
– మాస్టర్‌ వీవర్ : నమస్తే సార్‌..
– పోలీసు అధికారి : అయితే నువ్వు మొత్తానికి పట్టించుకోవు. అంతేకదా.
– మాస్టర్‌ వీవర్ : పట్టించుకోవడం కాదు సార్‌. దాంట్లో నాకు సంబంధంలేదు సార్‌.
– పోలీసు అధికారి : సరే ఓకే నీ ఫైనల్‌ డెసిజన్‌ అదే కదా. అంతే కదా.
– మాస్టర్‌ వీవర్ : పట్టించుకోవడం కాదుసార్‌. దాంట్లో నేను ఏమి చేయలేదు సార్‌.
– పోలీసు అధికారి : సరే అదే నీ ఫైనల్‌ డెసిజన్‌ అదే కదా. లేదు కదా.. అదే నీ ఫైనల్‌ డెసిజన్‌ కదా అంటున్నా అంతే.
– మాస్టర్‌ వీవర్ : నిజంగా నాకు సంబంధంలేదు సార్‌.
– పోలీసు అధికారి : నీ ఇన్‌వాల్‌మెంట్‌లేదు కదా. రైట్‌ ఓకే.. ఓకే .. నీ కర్మపో.. వదిలేసెయ్‌.. వెయిట్‌ అండ్‌ సీ.. చూడు. వెయిట్‌ చేసి చూడు. నీ కర్మకు నీవే బాధ్యుడు అవుతావ్‌.
– మాస్టర్‌ వీవర్ : అది కాదు సార్‌. నాకు ఎలాంటి సంబంధంలేదు సార్‌
– పోలీసు అధికారి : ఏయ్‌ నువ్వు ఎవరెవరినో నమ్ముకుని వాడొస్తాడు, వీడొస్తాడు, చేస్తాడని వారిని నమ్ముకుని ఉన్నావు కదా. వెయిట్‌ చేసి చూడు. ఏమిలేదు కదా వెయిట్‌ అండ్‌ సీ..
– మాస్టర్‌ వీవర్ : లేదు సార్‌. అలా ఎందుకంటారు సార్‌. నాకు సంబంధంలేదు సార్‌.
– పోలీసు అధికారి : నీ కర్మకు నీవే బాధ్యుడు అవుతావ్‌. వెయిట్‌ అండ్‌ సి. రైట్‌...
– మాస్టర్‌ వీవర్ : దేవుడు పెట్టినట్లు అయితుందిలే సార్‌...
ప్రజల సమస్యలను పరిస్కరించాల్సిన పోలీసులే వసూళ్ల పేరుతో వేధించుకు తింటుంటే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని నేతన్నలు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు