హమ్మయ్యా..!

16 Jul, 2014 02:48 IST|Sakshi
హమ్మయ్యా..!

 ముఖం చాటేసిన మబ్బులు..గోదావరిలో అడుగంటుతున్న జలాలు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు సమీపంలో తేలిన ఇసుక తిన్నెలు.. కాలువల నుంచి శివారుకందని నీరు.. బీడువారిన పొలాలు.. మొన్నటి వరకు డెల్టా రైతులకు కళ్లముందు గోచరించిన దృశ్యాలివి. ఎల్‌నినో ప్రభావంతోగత వారం వరకు డెల్టా పరిధిలోని శివారు, మెరక ప్రాంతాల్లో సాగు ప్రశ్నార్థకమై రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అల్పపీడన ప్రభావంతో మూడు రోజులు  వర్షాలు కురవడం... గోదావరికి ఎర్రనీరు పోటెత్తడం వంటి పరిణామాలు రైతులకు ఊరట కలిగించాయి.
 
 అమలాపురం :ఖరీఫ్ వరిసాగు జిల్లాలో 5.53 లక్షల ఎకరాల్లో జరుగుతుండగా, తూర్పు, పశ్చిమ డెల్టాల్లోనే సుమారు 4.20 లక్షల ఎకరాల్లో (75 శాతం) సాగుతుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ రెండు డెల్టాలకు ధవళేశ్వరం సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ నుంచి సాగు నీరందే సౌలభ్యం ఉండడం వల్ల ఇక్కడ ఖరీఫ్ సాగుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. వర్షాలు పూర్తిస్థాయిలో పడకున్నా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి జూన్ 10 నుంచి 15 మధ్య కాలంలో ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేస్తుంటారు. రైతులు నారుమడులు వేసుకునే సమయంలో రోజుకు కనిష్టంగా  ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతుంటారు. జూలై మొదటివారం నుంచి రుతుపవనాల ప్రభావంతో జోరుగా వర్షాలు పడడం, బ్యారేజ్ క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి సమృద్ధిగా నీరు రావడం వల్ల నాట్లు వేసే సమయంలో కాలువల ద్వారా మూడు డెల్టాలకు కనిష్టంగా పది వేల నుంచి గరిష్టంగా 12 వేల క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేస్తుంటారు.
 
 అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో జూన్ 15 నుంచి కాలువలకు నీటిని విడుదల చేసినా అవసరమైన నీరు లేక చాలా రోజుల పాటు ఏడు వేల క్యూసెక్కుల మించి సరఫరా చేయలేకపోయారు. దీనివల్ల డెల్టాలోని శివారు, మెరక ప్రాంతాలకు నీరందక నారుమడులు వేయడం ఆలస్యమైంది. నీరందకపోవడానికి తోడు వర్షాలు లేక పరిస్థితి దారుణంగా మారింది. ఒకానొక సమయంలో శివారు, మెరక ప్రాంత రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సాగు వదులుకోవాలనే ఆలోచనకు సైతం వచ్చారు. ప్రస్తుతం డెల్టాలో జోరుగా నాట్లు పడాల్సి ఉండగా, ఇంతవరకు ఐదు శాతం కూడా నాట్లు వేయలేదు. నారుమడులు సైతం 70 శాతం మించలేదు. మధ్యడెల్టాల్లో 50 శాతం మాత్రమే నారుమడులు పడ్డాయి. సమయం మించిపోతున్నా వాతావరణం కలిసిరాక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
 
 వర్షాలు.. వరద నీటితో ఊరట
 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవడంతో డెల్టాలో పరిస్థితి మారింది. రైతులు పూర్తిస్థాయిలో సాగుకు సన్నద్ధమయ్యారు. నారుమళ్లు పూర్తయిన చోట దమ్ములు ఆరంభించారు. సాగు ఆలస్యమైన చోట రైతులు వెదజల్లు, డ్రమ్ సీడర్ పద్ధతిలో నాట్లు వేసేందుకు ముమ్మరంగా దమ్ములు చేస్తున్నారు. ఈ సమయంలో గోదావరికి ఎర్రనీరు పోటెత్తడం రైతుల్లో సాగుకు భరోసా కల్పించింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగింది. కాలువలకు నీరు వదిలిన సరిగ్గా నెలరోజుల తరువాత ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మిగుల జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 9,604 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. పంటకాలువలకు సైతం నీటి విడుదలను పెంచారు.
 
 సోమవారం మూడు డెల్టాలకు 10,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా మంగళవారం మరింత పెంచారు. జిల్లాలోని రెండు డెల్టాలకు కలిపి 5,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీనితో పంటకాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. శివారు, మెరక ప్రాంతాలకు కూడా ఇప్పుడిప్పుడే నీరందుతుండడంతో రైతులు ఊపిరిపీల్చుకుంటున్నారు. సాగులో వెనుకబడ్డ తూర్పుడెల్టాలోని కరప, రామచంద్రపురం, మధ్యడెల్టాలోని అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు సబ్ డివిజన్ల పరిధిలోని శివారు గ్రామాల్లో సాగు ఊపందుకోనుంది.
 

>
మరిన్ని వార్తలు