గాలిలో దీపంలా డయాలసిస్

27 Jun, 2016 04:30 IST|Sakshi

వేల సంఖ్యలో పెరుగుతున్న రోగులు
చాలీచాలని రక్తమార్పిడి యంత్రాలు
నెలల తరబడి ఎదురు చూస్తున్న వైనం
సకాలంలో రక్తమార్పిడి చేసుకోలేక అవస్థలు

 

తిరుపతి మెడికల్ : చిత్తూరుకు చెందిన రమేష్ (పేరు మార్చాం) రెండు కిడ్నీలు పాడవడంతో రక్తమార్పిడి (డయాలసిస్) వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి వచ్చాడు. ఇక్కడ పెరిటోనియన్ (పొట్టలోని  రక్తాన్ని నీటితో పరిశుభ్రం చేసే ప్రక్రియ) డయాలసిస్ చేసేందుకు అవసరమైన సౌకర్యం లేకపోవడంతో వెనుదిరిగాడు. రెండు రోజుల్లోనే ఆ రోగి మరణించాడు... మరో రోగి రాము(పేరుమార్చాము) సకాలంలో రక్తమార్పిడి చేసుకోలేక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ఎంతో మంది కిడ్నీలు చెడిపోయి.. సకాలంలో డయాలసిస్ చేసుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు...

 
ఆరోగ్యశ్రీనా.. ఖాళీ లేవు!

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ చేసుకునే సౌలభ్యం ఉన్నా ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. డయాలసిస్ కోసం వచ్చే నిరుపేదలకు ‘అయ్యో ఆరోగ్యశ్రీనా...మా వద్ద ఖాళీగా లేవు. ఏడాది సమయం పడుతుంది. మీరు రుయా ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాయి. ఆర్థిక స్థోమత ఉన్న రోగులకు సేవలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నాయి.

 
పక్కన పెట్టేస్తున్నారు

జిల్లాలో 1,150 నుంచి 1,200 మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. చిత్తూరు, మదనపల్లి, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి, పలమనేరు, కుప్పం, పీలేరు తదితర ప్రాంతాల నుంచి డయాలసిస్ రోగులు తిరుపతికి వస్తుంటారు. వీరి కోసం స్విమ్స్, రుయా ఆస్పత్రులతోపాటు నగరంలో మరో 8 ప్రయివేట్ డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చేసుకునే సౌకర్యం ఉంది. ప్రయివేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేసుకునేందుకు ఆరోగ్యశ్రీ రోగులకు కష్టాలు తప్పడం లేదు. ఎవరైతే అధిక డబ్బులు చెల్లిస్తారో వారికి మొదట ప్రాధాన్యత ఇస్తూ, ఆరోగ్యశ్రీ రోగులను పక్కన పెట్టేస్తున్నారు.

 
బిల్లులు ఆలస్యమవుతాయనీ..

సాధారణంగా ఆరోగ్యశ్రీ రోగులకు ప్యాకేజీ కింద డయాలసిస్‌కు ఒక సిట్టింగ్‌కు రూ.1250 చొప్పున నెలలో 25 రోజులకు 10 సిట్టింగ్‌లకు కలిపి రూ.12,500 ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే ప్యాకేజీల వల్ల నెలలు తరబడి బిల్లులు రావడం లేదని, అప్పులు మిగులుతున్నాయంటూ రోగులను తిప్పి పంపేస్తున్నారు. స్పాట్ పేమెంట్ పేరుతో రోగికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి ఒక సిట్టింగ్ రూ.2వేల నుంచి రూ.2,900 వరకు వసూలు చేస్తున్నారు. అదికూడా నిర్థిష్టమైన 4గంటల సమయంలో, నిపుణుల చేత డయాలసిస్ చేయాల్సి ఉన్నా, అధిక డబ్బులకు ఆశపడుతూ, రోగుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం రెండు గంటల్లోనే రక్తమార్పిడి ప్రక్రియను మమ అనిపించేస్తున్నారు. డయాలసిస్ సరిగా చేయక పోవడంతో వ్యాధి ముదరబెట్టుకుంటూ చెన్నై, బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రులకు రోగులు పరుగులు తీస్తున్నారు.

 
రోగులు ఎక్కువ.. మిషన్లు తక్కువ

రుయా ఆస్పత్రి ఆరోగ్యశ్రీ రోగులకు అండగా నిలుస్తోంది. రుయాలో మొత్తం 10 డయాలసిస్ మిషన్లు ఉండగా ఒక్కో మిషన్ ద్వారా రోజుకు నలుగురికి డయాలసిస్ చేస్తున్నారు. రక్తమార్పిడి కోసం 593 మంది నమోదు చేసుకోగా అందులో ప్రస్తుతం 507 మంది డయాలసిస్ చేసుకుంటున్నారు. ఇంకా 86 మంది వెయిటింగ్‌లో ఉన్నారు. వీరికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. మరో 20 మిషన్లు ఏర్పాటు చేస్తే గానీ ఇక్కడ రోగులకు సరైన సేవలు అందించలేని పరిస్థితి. కార్పొరేట్ ఆస్పత్రిగా గుర్తింపు ఉన్న స్విమ్స్‌లో గత వారంలో 700 మంది డయాలసిస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 400 మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉన్నారు. వీరందరికీ కేవలం 35 మిషన్ల ఉన్నాయి. ఒక్కో మిషన్ రోజుకు ముగ్గురు రోగులకు డయాలసిస్ చేస్తోంది. వెయిటింగ్‌లో చాలా మంది ఉన్నట్టు సమాచారం. ఇక్కడ మరో 65 మిషన్లు కొనుగోలు చేసేందుకు, పక్కా భవనం నిర్మించేందుకు నిధులు కేటాయించినా అమలుకు నోచుకోవడం లేదు.

మరిన్ని వార్తలు