వజ్రాల వేట ప్రారంభం 

6 Jun, 2018 12:54 IST|Sakshi
వజ్రకరూరు సమీపంలోని పోలంలో వజ్రాల కోసం గుంపులు గంపులుగా వెతుకుతున్న దృశ్యం

వజ్రకరూరు పరిసరాల్లో వెదుకులాట   గుంపులు గుంపులుగా చేరుకుంటున్న జనం   చిన్న వజ్రం దొరికినా దశ తిరిగినట్లే...

సాక్షి, వజ్రకరూరు : మండల కేంద్రం వజ్రకరూరు పరిసర పొలాల్లో వజ్రాల వేట ప్రారంభమైంది. ఏటా జూన్‌ మాసంలో తొలకరి వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి అనేకమంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం అన్వేషించడం పరిపాటి. ఆదివారం సాయంత్రం భారీ గాలులతోపాటు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రెండురోజులుగా వజ్రాల కోసం అన్వేషకుల తాకిడి పెరిగిపోతోంది. పురుషులు, మహిళలు, చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వెదకడంలో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ లభించే వజ్రాలు కోహినూర్‌ వజ్రంతో సమానంగా ఉంటాయని అంటుంటారు. దేవుడు కరుణిస్తే తమ తలరాతలు మారిపోతాయేమోనని ప్రజలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరైతే భోజనాలను కూడా అక్కడికే తెచ్చుకుంటున్నారు. పొలాల్లో విత్తనం వేసేంతవరకు వజ్రాలకోసం వెతకడం జరుగుతూనే ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు పైభాగంలోనుంచి నీరుకిందకు వచ్చినప్పుడు ఒడ్డు ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తాయనే భావనతో ప్రజలు వెదుకుతున్నారు. ఇక్కడ లభించే వజ్రాలు గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నాయి.   

   

మరిన్ని వార్తలు