ఎస్‌కే పాలెంలో డయేరియా!

22 Mar, 2018 09:23 IST|Sakshi
పామర్రు పీహెచ్‌సీలో వైద్య సేవలు పొందుతున్న రోగులు

20 మందికి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది

వేర్వేరు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న బాధితులు

పెరిశేపల్లి (పామర్రు) : మండల పరిధిలోని పెరిశేపల్లి గ్రామ శివారు ప్రాంతమైన సబ్ధర్‌ఖాన్‌ పాలెంలో మూడు రోజులుగా డయేరియా వ్యాధి లక్షణాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆదివారం రాత్రి గ్రామానికి దగ్గరలో జుఝవరం ఎస్సీ కాలనీలో ఉంటున్న నిల్వ కూలీలు ఎస్‌కే పాలెంలోని బావి నీరు తాగటం కారణంగా ముగ్గురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి  గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లారు. అలాగే, సోమవారం ఎస్‌కే పాలెంలోని ప్రజలు అదే బావి నీటిని తాగడంతో కొందరు అనారోగ్యానికి గురయ్యారు. గ్రామానికి చెందిన జె దినేష్, జె సౌజన్య, కె కళ్యాణి, వీ ఉషారాణి, కె రామ్‌చరణ్‌లకు వాంతులు, విరేచనాలు కావడంతో పామర్రులో ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించారు.

అక్కడి ఫీజులకు భయపడి స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు గ్రామ ప్రముఖుడు వీరిని తరలించారు. వీరిలో ఉషారాణిని మెరుగైన వైద్యం కోసం గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి మొర్ల సరస్వతి, సిరిపురపు  సత్యనారాయణ, మొర్ల పైడమ్మలతో పాటు మరో ముగ్గురికి విరేచనాలు అవ్వడం  గుర్తించి వారిని కూడా పామర్రులో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరూ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో జె దినేష్‌ అనే చిన్నారిని మంగళవారం వైద్యశాలలో చేర్పించి సాయంత్రం తగ్గిపోయిందని ఇంటికి పంపించారు. అయితే, బుధవారం ఉదయం మరలా విరేచనాలు అవ్వడంతో తిరిగి వైద్యశాలకు తరలించారు. కాగా, పామర్రులోని మరో ప్రయివేటు వైద్యశాలలో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

కప్పి పుచ్చిన స్థానిక నేతలు
మూడు రోజులుగా గ్రామస్తులు డయేరియాతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అధికార పార్టీ నేతలు కప్పిపుచ్చారు. ఏఎన్‌ఎంలు, ఆశాల ద్వారా మందు బిళ్లలను, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేయిస్తున్నారు. కలుషిత తాగునీటి విషయాన్ని ఫుడ్‌ పాయిజన్‌గా ప్రచారం చేస్తున్నారు. ఫుడ్‌ పాయిజన్‌ అయితే ఓ ఇంటికే పరిమితం అవుతుంది. కానీ, ఇక్కడ గ్రామంలో చాలామంది అనారోగ్యానికి గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

నారా లోకేష్‌ దత్తత గ్రామంలో కూడా..
వారం రోజుల క్రితం మంత్రి నారా లోకేష్‌ దత్తత గ్రామమైన నిమ్మకూరులోని ఓ రైతు  శ్రీకాకుళం నుంచి నిల్వ కూలీలను తీసుకువచ్చారు. వీరిలో కొందరు గ్రామంలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలలో వాడుకోగా మిగిలిన ఆహారాన్ని నిల్వ ఉంచి తిన్న కారణంగా ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురై అనారోగ్యం పాలయ్యారు. హుటాహుటిన ఆ రైతు కూలీలను మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వారిని అక్కడి నుంచి నిమ్మకూరు రాకుండా శ్రీకాకుళం పంపించి వేసి విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని సమాచారం.

నీటి శాంపుల్స్‌ సేకరణ
తాగునీటికి వినియోగించే బావి నీటిని సేకరించి పరీక్షల నిమిత్తం పంపించామని వైద్యురాలు ఆర్‌ఎన్‌ జ్యోత్న్స తెలిపారు. రిపోర్టులు వస్తే కాని ఏ విషయమూ నిర్ధారించలేమన్నారు. నిమ్మకూరు పీహెచ్‌సీ వైద్యురాలు పద్మజ, పీçహెచ్‌ఎన్‌ ఇందిరాకుమారి, ఏఎన్‌ఎం ధనలక్ష్మి గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్నారు.

గ్రామంలో తహసీల్దార్‌ పర్యటన
పెరిశేపల్లి (పామర్రు) : గ్రామ శివారు ప్రాంతమైన ఎస్‌కే పాలెంలో బుధవారం తహసీల్దార్‌ ఎం. పద్మకుమారి పర్యటించారు. గ్రామంలో వైద్య సిబ్బందితోపాటు ఇంటింటికి తిరిగి అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి అనారోగ్యం రావడంతో పామర్రు పీహెచ్‌సీలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే పరిస్థితి ఎస్‌కే పాలెంలోని మరి కొందరికి ఏర్పడిందని, వారికి కూడా వైద్య సేవలు అందుతున్నాయని, పరిస్థితి అదుపులో ఉన్నదని తెలిపారు. ఎవరికి ప్రాణహాని లేదని పేర్కొన్నారు. గ్రామంలోని నూతి నీటిని పరీక్షలకు పంపగా ఏమీ లేదని రిపోర్టు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు