పైడూరుపాడులో డయేరియా

7 Apr, 2018 08:24 IST|Sakshi
అస్వస్థతకు గురియైన రోగిని పరిక్షిస్తున్న వైద్యురాలు

24 మందికి అస్వస్థత

చికిత్స అందిస్తున్న వైద్యులు

ఒకరు విజయవాడ ఆస్పత్రికి తరలింపు

విజయవాడ రూరల్‌(మైలవరం): విజయవాడ మండలంలోని పైడూరుపాడులో శుక్రవారం డయేరియా విజృంభించింది. 24 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరిని విజయవాడ వైద్యశాలకు తరలించారు. వివరాలు.. తాగునీటిని సరఫరా చేసే పైపులైన్‌ లీక్‌ కావడంతో కలుషిత నీటిని తాగడంతో గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఒకరికి విరోచనాలు కావడంతో డయేరియాగా గుర్తించారు. దీంతో ఇళ్లల్లో తాగునీటిని తాగడం నిలిపివేశారు. అనారోగ్యానికి గురైన వారిలో బోయినపల్లి వెంకటేశ్వరావు, వేముల నారాయణ, వేముల శ్రీన్‌సూర్య, పగడాల నారాయణ, çమామిళ్ళ పల్లిసుభద్ర, శైలజ, రావు రంగమ్మ, రమాదేవి, మాధవి, బోయినపల్లి పార్వతి, వేముల లక్ష్మీకుమారి, వేములరాణి, మరో 12 మంది ఉన్నారు. అందులో బోయనపల్లి పద్మావతి(58)ని విజయవాడ వైద్యశాలకు తరలించారు.

వైద్యశిబిరం..
డయేరియా కేసులు నమోదు కావడంతో కొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్యశిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్‌ పద్మావతి వైద్యసేవలందించారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు బాధితులకు పంపిణీ చేశారు. నమూనాలను సేకరిస్తున్నట్లు వైద్యురాలు తెలిపారు.

పైపులైన్‌ లీకులతో అవస్థలు..
మైలవరం ప్రాజెక్టు నుంచి పైడూరుపాడు గ్రామానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు.  కృష్ణానది నీరు మైలవరం వచ్చి అక్కడ నుంచి పైపులైను ద్వారా గ్రామంలోని ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను నింపుతారు. కుళాయిల ద్వారా తాగునీటిని పంచాయతీ సరఫరా చేస్తోంది.  సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పైపు లైనుపై భాగంలోడ్రెయినేజీ కాల్వ ఉండటంతో తాగునీటి పైపులైను లీక్‌ కావడంతో  వాటిని తాగిన పడమర బజారుల్లోని  ప్రజలు డయేరియా బారిన పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాన్ని తహసీల్దార్‌ రవీంద్ర, ఎంపీడీఓ కె.అనూరాధ,  మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ గోపాలకృష్ణ, గ్రామసర్పంచి కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యుడు సీతారామయ్య ,మాజీ  సర్పంచి రంగినేనినరేంద్ర, ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

మంత్రి దేవినేని ఉమా ఆరా
డయేరియా ప్రభావంతో 24 మంది అస్వçస్థతకు గురైన సమాచారం అందిన వెంటనే రాష్ట్ర జలవనరులశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అధికారులను గ్రామానికి పంపారు. మెరుగైన వైద్యసదుపాయలు అందించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా విషయంపై ఆర్‌డబ్ల్యూ ఎస్‌ డీఈ సామిని ‘సాక్షి’ వివరణ కోరగా తాగునీటిని పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. వచ్చిన తరువాత నీటి వలన వచ్చిందా లేదా అనే విషయం తెలుస్తోందన్నారు.

డయేరియా అదుపులోనే ఉంది
గ్రామంలో కలుషిత నీరు తాగడంవలన విరేచనాలు అయ్యాయి. పడమర బజారులోని  24 మంది అస్వస్ధతకు గురయ్యారు. వైద్యాధికారులు గ్రామంలో 552 గృహాలను పరిశీలించారు.– రవీంద్ర, తహసీల్దార్‌

మరిన్ని వార్తలు