గోకులానికి మొండిచేయి

5 Mar, 2019 17:35 IST|Sakshi

నిధుల లేమితో పథకం రద్దు

లబ్ధిదారులకు డీడీలు వాపస్‌

షెడ్లు నిర్మించుకున్నా అందని మొత్తాలు

అయోమయంలో పాడి రైతులు

ప్రభుత్వ విధానాలతో జిల్లాలోని పాడిపరిశ్రమ అట్టడుగుస్థాయికి పడిపోతోంది. గతంలో, ప్రస్తుతం పాడి రైతులు సీఎం చంద్రబాబునాయుడు మోసాలకు బలవుతూనే ఉన్నారు. సొంత ప్రయోజనం కోసం గతంలో జిల్లాకే తలమానికమైన విజయా డెయిరీని మూయించి వేసి పాడి రైతులను అధోగతి పాలు చేశారు. అదే రీతిలో ప్రస్తుతం పాడి రైతులను ఆదుకుంటున్నామనే పేరుతో దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నారు. గోకులం పథకం పేరుతో ప్రతి పాడి రైతుకూ సబ్సిడీపై ఆవుల షెడ్డుకు నిధులు అందిస్తామని ప్రకటనలిచ్చారు. నిధుల లేమిని సాకుగా చూపి అర్ధంతరంగా నిలిపేశారు. షెడ్లు నిర్మించుకుని నిధులు మంజూరుకాకపోగా, కట్టిన డీడీలు కూడా వెనక్కి ఇస్తుండడంతో రైతులు అయోమయంలో పడ్డారు.

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని రైతాంగానికి పాడి పరిశ్రమే ప్రధాన జీవనాధారం. పంటలు లేకపోయినా పాడి పరిశ్రమతో జీవనం సాగిస్తున్న కుటుంబాలే అధికం. జిల్లావ్యాప్తంగా 6.67 లక్షల రైతు కుటుంబాలు ఉండగా పాడి పరిశ్రమపై ఆధారపడి దాదాపు 5 లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 10.20 లక్షల పాడి ఆవులు, గేదెలను రైతులు పోషిస్తున్నారు. వాటి ద్వారా రోజుకు 32 లక్షల నుంచి 34 లక్షల లీటర్ల మేరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 21 లక్షల నుంచి 22 లక్షల లీటర్ల మేరకు పాలను విక్రయిస్తున్నారు. దీంతో వచ్చే ఆదాయంతో కుటుంబాలను, పశువులను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.


గోకులం పథకం ఇలా..
ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు గాను ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటనలు గుప్పించారు. ఇందుకుగాను ప్రతి పాడి రైతుకూ పశువుల షెడ్డు నిర్మించుకునేందుకు 90 శాతం సబ్సిడీపై నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అందులో రెండు ఆవుల షెడ్డుకు గాను రూ.97 వేలు, నాలుగు ఆవుల షెడ్డుకు గాను రూ.1.47 లక్షలు, ఆరు ఆవుల షెడ్డుకు గాను రూ.1.75 లక్షల చొప్పున నిధులను 90 శాతం సబ్సిడీపై అందిస్తామని గత ఏడాది నవంబరులో ప్రకటించారు.

 
నీరుగారిన పథకం..
గోకులం పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 14 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో డిసెంబరు నెలాఖరుకు 4,256 మంది రైతులు సబ్సిడీ పోగా మిగిలిన 10 శాతం నిధులకు డీడీలు కట్టారు. మరింత మంది రైతులు డీడీలు కట్టేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వం గోకులం పథకాన్ని పెండింగ్‌లో పెట్టింది. జనవరిలో సబ్సిడీ మొత్తాన్ని 90 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. దీంతో అప్పటికే డీడీలు కట్టిన రైతులు మిగిలిన 20 శాతం మొత్తాలకు కూడా డీడీలు ఇవ్వాలని పశుసంవర్థక శాఖ అధికారులు తెలియజేశారు.

ఈ నేపథ్యంలో అప్పటికే సొంత డబ్బు వెచ్చించి షెడ్లు నిర్మించుకున్న రైతులు విధిలేక మిగిలిన 20 శాతం డబ్బులను కూడా 1,982 మంది రైతులు కట్టారు. అయినా వారికి ఇంతవరకు షెడ్డు నిర్మాణానికి అందించాల్సిన నిధులు ఒక్కపైసా కూడా మంజూరు కాలేదు. డీడీలు చెల్లించిన 4,256 మంది రైతుల్లో ప్రభుత్వం 2,731 యూనిట్లు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన 1,525 మందిలో 20 శాతం డీడీలు కట్టని 749 మంది, 10 శాతం డీడీలు కట్టి పథకం మంజూరు కాని వారు ఉన్నారు. వీరు కట్టిన డీడీలను అధికారులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. అదేగాక 30 శాతం డీడీలు కట్టిన వారికి కూడా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడంతో డీడీలు వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో గోకులం పథకం ద్వారా షెడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపినట్లయింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు