కూలీల కడుపుకొడుతున్న షార్ అధికారులు!

22 Apr, 2016 04:30 IST|Sakshi
కూలీల కడుపుకొడుతున్న షార్ అధికారులు!

కూలి ఇవ్వకపోవడంతో పనులకు
వెళ్లకుండా గిరిజనుల ఆందోళన

 
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్)లో తోటమాలి పనులు చేస్తున్న శబరి గిరిజన కాలనీకి చెందిన 200 మంది కూలీలకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సమాచారం. తోటమాలి పను లు చేసేవారికి వారానికి ఒకసారి జీతభత్యాలు ఇస్తుం టారు. ఈసారి మాత్రం షార్ అధికారులు కావాలనే వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవానికి షార్‌లో ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ అండ్ హార్టికల్చర్ డివిజన్ పరిధిలో తోటమాలి పను లు చేయిస్తుంటారు. దీనికి మూడేళ్లకు ఒకసారి టెం డర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు ఇస్తుంటారు. షార్‌లోనే పుట్టి పెరిగిన శబరి గిరిజన కాలనీలకు చెందిన కూలీలను ఏర్పాటుచేసుకుని కాంట్రాక్టర్ పనులు చేయించుకునేవారు.

అయితే కాంట్రాక్టర్లు ఇస్తున్న కూలి తక్కువగా ఉండటంతో అక్కడి యానాదులం తా కలసి ‘శ్రీహరికోట యానాది మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ లేబర్ కాంట్రాక్టు సొసైటీ లిమిటెడ్’ ఏర్పాటు చేసుకుని శబరికాలనీలోనే హట్ నంబర్ ఏ-32లో కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. తోటమాలి పనులకు సంబంధించి 2015 డిసెంబర్‌లో జరిగిన టెండర్లలో ఈ సొసైటీ కూడా అందరితో పాటు టెండర్ వేసింది. అందరికంటే తక్కువగా రూ.54.60 లక్షలకు కోట్ చేసి వేయడంతో పనులు ఆ సొసైటీకి అప్పగించాల్సి వచ్చింది.

ఈ కాంట్రాక్టు దక్కించుకున్న సొసైటీ వారు ఈ ఏడాది జనవరి నుంచి పనులు చేస్తున్నారు. అయితే సొసైటీ తరఫున వారానికి ఎంత వస్తుందో అంత మొత్తాన్ని కూలీలందరూ సమష్టిగా తీసుకుంటూ పనులు చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ప్రమాదమని షార్‌లోని ఫారెస్ట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులు, కాంట్రాక్టర్లు యానాదులను ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలనే దురుద్దేశంతోనే జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలున్నాయి.


 అధికారుల ఇంటి పనివారికీ..
 షార్‌లో చాలామంది ఉన్నతాధికారులు ఇళ్లలో పనులు చేయించుకునే వారికి కూడా తోటమాలి పనుల కింద మస్టర్‌రోల్ వేసి జీతాలు ఇస్తున్నారని, ప్రయోగాల సమయంలో తక్కువమందితో పనిచేయించి ఎక్కువమందికి మస్టర్‌రోల్ వేసి డిపార్ట్‌మెంట్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకుని తింటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిన్నింటికీ చెక్‌పెడుతూ యానాదులు సొసైటీని ప్రారంభించి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చేశారు. దీనిని జీర్ణించుకోలేని వారు సొసైటీని నాశనం చేసేందుకు కుట్రలు పన్ని, వారి కడుపులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కక్షపూరిత ధోరణిని మాని న్యాయంగా కాంట్రాక్టు పొందిన గిరిజన కూలీలకు సకాలం లో కూలి చెల్లించకపోతే ఆందోళన చేపడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరిస్తున్నారు.


 షార్ డెరైక్టర్‌కు ఫిర్యాదు
 షార్‌లో తోటమాలి పనులు చేస్తున్న గిరిజన కూలీలకు జీతభత్యాలు ఇవ్వకుండా వేధిస్తున్న వైనాన్ని శ్రీహరికోట యానాది మ్యూచువల్ ఏయిడెడ్ కో ఆపరేటివ్ లేబర్ కాంట్రాక్టు సొసైటీ లిమిటెడ్ ప్రతినిధులు గురువారం డెరైక్టర్ కున్హికృష్ణన్ ఫిర్యాదు చేశారు. పది రోజు ల నుంచి జీతాలు ఇవ్వకపోతే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా సమష్టిగా పనులు చేసి కష్ట పడుతుంటే ఎందుకిలా వేధిస్తున్నారో అర్థం కావడంలేదని వాపోయారు. విచారించి తమకు న్యా యం చేయాలని సొసైటీ సభ్యులు డెరైక్టర్‌ను కోరా రు. దీనిపై షార్ కంట్రోలర్ రాజారెడ్డిని వివరణ కోర గా ఈ నెలలో వరుసగా బ్యాంక్ సెలవులు రావడంతో కూలి ఇవ్వడం ఆలస్యమైందన్నారు. గిరిజనేతర కూలీలు వస్తే దీనిపై విచారణ చేపడతామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు