ప్లాస్టిక్‌ నుంచి డీజిల్‌ తయారీ

8 Dec, 2019 04:13 IST|Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో సీఎస్‌ఐఆర్‌ డీజీ శేఖర్‌ మాండే

జన్యు వైవిధ్యం మన వాళ్లలో చాలా ఎక్కువ 

అందుకే అరుదైన జెనెటిక్‌ డిజార్డర్స్‌ వస్తున్నాయి 

దేశానికి ఇంధన భద్రత ‘బయో ఫ్యూయల్‌’ ఇస్తుంది 

అల్జీమర్స్‌కు కుంకుమ పువ్వు నుంచి మందు తయారు చేశాం

చిన్న విమానాల మీద పరిశోధనలు చేస్తున్నాం

(మల్లు విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి): కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో 38 పరిశోధన సంస్థలు ఉన్నాయి. వాటిలో 4,500 మంది శాస్త్రవేత్తలు వివిధ రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి సీఎస్‌ఐఆర్‌ పనిచేస్తోంది. పర్యావరణం మొదలు ఆరోగ్యం వరకు.. పలు రంగాల్లో అవసరమైన పరిశోధన ఫలితాలను దేశానికి అందించడానికి నిరంతరం పనిచేస్తున్నామని సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ మాండే చెప్పారు. ‘పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్‌’ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ..  

మందులు, టీకాలు కనిపెట్టడానికి జన్యు శ్రేణి 
మన దేశ ప్రజల్లో ఉన్న వైవిధ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు. జినోమ్‌ సీక్వెన్స్‌ (జన్యు శ్రేణి) కూడా మన వాళ్లలో ఉన్నంత విభిన్నంగా మరెక్కడా ఉండదు. అందువల్లే మనదేశంలో అరుదైన జెనెటిక్‌ డిజార్డర్స్‌ (జన్యు సంబంధిత సమస్యలు) ఎక్కువ. వీటిని అధిగమించడానికి 1008 మంది జన్యు శ్రేణులను రూపొందించాం. మందులు, టీకాలు కనిపెట్టడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. మానవుల జన్యు బ్లూప్రింట్‌ను డీకోడ్‌ చేయడానికి జన్యు శ్రేణి పనికొస్తుంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ), సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్తంగా జన్యుశ్రేణి రూపకల్పన ప్రాజెక్టును చేపట్టాయి. అలాగే డెంటల్‌ ఇంప్లాంట్స్‌ను చౌకగా తయారుచేసే పరిజ్ఞానాన్ని రూపొందించాం. దీనివల్ల ఇప్పుడున్న ధరల్లో మూడో వంతుకే ఇంప్లాంట్స్‌ లభించనున్నాయి.  

స్పెంట్‌ వాష్‌ను శుద్ధి చేస్తే.. 
మద్యం తయారీ ప్లాంట్ల (డిస్టిలరీస్‌)లో వ్యర్థ జలాలను ‘స్పెంట్‌ వాష్‌’ అంటారు. దీన్ని శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటివరకు లేదు. ఒక లీటరు మద్యం తయారు చేస్తే 10–15 లీటర్ల వ్యర్థజలం (స్పెంట్‌ వాష్‌) వస్తుంది. మొలాసిస్‌ నుంచి మద్యం తయారుచేసే కర్మాగారాలు దేశంలో 300కు పైగా ఉన్నాయి. ఇవి ఏటా 250 కోట్ల లీటర్ల స్పెంట్‌ వాష్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని అంచనా. ఇవి స్పెంట్‌ వాష్, మిగతా వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు వదులుతున్నాయి. ఫలితంగా తీవ్ర దుర్గంధం వెలువడటంతోపాటు పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. స్పెంట్‌ వాష్‌లో కాలుష్యానికి కారణం.. పొటాష్‌. దీన్ని వేరు చేస్తే మిగతా వ్యర్థాలను తొలగించడం చాలా సులువు. పొటాష్‌ను వేరు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని సెంట్రల్‌ సాల్ట్‌ అండ్‌ మెరైన్‌ కెమికల్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ) అభివృద్ధి చేసింది. పొటాష్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నాం. స్పెంట్‌ వాష్‌ను శుద్ధి చేస్తే.. రూ.700 కోట్ల విలువైన పొటాష్‌ను ఉత్పత్తి చేయొచ్చు. శుద్ధి ప్రక్రియలో శుద్ధ జలం కూడా వస్తుంది. ఆ నీటిని డిస్టిలరీస్‌ వాడుకోవచ్చు. అయితే.. స్పెంట్‌ వాష్‌ శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు మరీ చౌక కాదు. 2.5 ఏళ్లలో పొటాష్‌ ఉత్పత్తి ద్వారా పెట్టుబడి వచ్చేస్తుంది. తర్వాత నుంచి లాభమే. 

వ్యర్థాల రీయూజ్‌కు పరిశోధనలు 
వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల తీవ్ర కాలుష్య సమస్యలు వస్తున్నాయి. వ్యర్థాలను తిరిగి ఉపయోగించడానికి అనువైన పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించే దిశగా పరిశోధనలు చేస్తున్నాం. రైతులు ఆ వ్యర్థాలను సులువుగా ‘రీయూజ్‌’ చేసే పరిజ్ఞానాన్ని వచ్చే సీజన్‌కు సీఎస్‌ఐఆర్‌ అందిస్తుంది.  
 
అల్జీమర్స్‌ వ్యాధికి మందు 
అల్జీమర్స్‌ వ్యాధికి కుంకుమ పువ్వు నుంచి మందు తయారు చేశాం. క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. 

ప్రత్యామ్నాయ వనరుల నుంచీ బయోఫ్యూయల్‌ తయారీ.. 
దేశానికి ఇంధన భద్రతను అందించే శక్తి బయో ఫ్యూయల్‌కు ఉంది. కానుగ నుంచే ఇప్పటివరకు బయోఫ్యూయల్‌ తయారు చేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల నుంచి కూడా తయారు చేయొచ్చు. సీఎస్‌ఐఆర్‌ రూపొందించిన బయో ఫ్యూయల్‌తో డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీకి విమానం నడిపాం. వాణిజ్యపరంగా బయోఫ్యూయల్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఇలా చేస్తే.. ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది. ప్లాస్టిక్‌ నుంచి డీజిల్‌ తయారీ ప్రయోగం కూడా విజయవంతమైంది. ఇటు ప్లాస్టిక్‌ సమస్యను, అటు ఇంధన కొరతను అధిగమించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేస్తే ప్లాస్టిక్‌ సమస్యను అధిగమించవచ్చు.

‘మేకిన్‌ ఇండియా’కు సహకారం
మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి సీఎస్‌ఐఆర్‌ తన వంతు సహకారమందిస్తోంది. వివిధ రంగాల్లో చేస్తున్న పరిశోధన ఫలితాలను పరీక్షించడానికి ఇటీవల భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకున్నాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందించడానికి ఇది దోహదం చేస్తుంది. 

19 సీట్ల విమానం సిద్ధమైంది..
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్, నేషనల్‌ ఏరోనాటిక్స్‌తో కలిసి తేలికపాటి విమానాల తయారీ మీద పరిశోధనలు చేస్తున్నాం. 19 సీట్ల ‘సరస్‌’ విమానం సిద్ధమైంది. దీన్ని పరీక్షిస్తున్నాం. 70 సీట్ల విమానం డిజైన్‌ ఆమోదం పొందింది. ఈ పరిశోధనలు పూర్తయితే.. దేశంలో చిన్న విమానాశ్రయాలకు కూడా విమానాలు తిరిగే అవకాశం ఉంటుంది. ‘విజిబిలిటీ’ తక్కువగా ఉన్నప్పుడు విమానాలు దిగడం (ల్యాండింగ్‌) పెద్ద సమస్య. దీన్ని అధిగమించడానికి హైలెవల్‌ సెన్సార్స్‌ ఉన్న ‘దృష్టి’ని రూపొందించాం. ప్రస్తుతం 50 ‘దృష్టి’ వ్యవస్థలను దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో వాడుతున్నారు. ఈ టెక్నాలజీని రెండు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చాం. ఆస్ట్రేలియా, యూరప్‌ దేశాలకు కూడా ఇవ్వబోతున్నాం. 

మరిన్ని వార్తలు