మూడోసారీ మువ్వా సరెండర్‌

12 Oct, 2018 08:00 IST|Sakshi

స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌కు కలెక్టర్‌ లేఖ

వెంటనే సరెండర్‌ చేస్తూ ఆదేశాలు  

నెల్లూరు (టౌన్‌): డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న మువ్వా రామలింగాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సరెండర్‌ చేశారు. ఆయన్ను జిల్లా నుంచి వరుసగా పాఠశాల విద్యాశాఖకు మూడుసార్లు సరెండర్‌ చేశారు. 2016 ఆగస్ట్‌లో డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ 2017 సెప్టెంబర్‌లో డీఈఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యాశాఖ కార్యాలయంలో రికార్డుల్లో అవకతవకలు, కార్యాలయ నిర్వహణ సక్రమంగా లేదంటూ పాఠశాల విద్యాశాఖకు సరెండర్‌ చేశారు. అనంతరం రెండు నెలల తర్వాత బీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉత్తర్వులు తీసుకొచ్చి వెంటనే బాధ్యతలు స్వీకరించారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌గా నాలుగు నెలల పాటు పనిచేశారు. ఆ సమయంలో ఓ ఉపాధ్యాయుడి విషయంలో డైరెక్టర్‌ ఉత్తర్వులను పాటించలేదనే ఫిర్యాదుతో మువ్వా రామలింగాన్ని రెండోసారి పాఠశాల విద్యాశాఖకు సరెండర్‌ చేశారు. తదనంతరం 2018 ఆగస్ట్‌ మొదటి వారంలో డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉత్తర్వులు తీసుకొని వెంటనే బాధ్యతలు స్వీకరించారు. 

సరెండర్‌ చేసినా మళ్లీ జిల్లాకు రావడంపై సీరియస్‌
డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మువ్వా రామలింగాన్ని రెండు సార్లు పాఠశాల విద్యాశాఖకు సరెండర్‌ చేసినా మళ్లీ జిల్లాకు రావడంపై కలెక్టర్‌ ముత్యాలరాజు సీరియస్‌గా తీసుకున్నారు. డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకునే సమయంలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలవలేదు. దీంతో మువ్వా వ్యవహారాన్ని కలెక్టర్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. అప్పుడే మువ్వా ఆర్డర్‌ను కలెక్టర్‌ వ్యతిరేకించినట్లు చెప్తున్నారు. అయితే కలెక్టర్‌ మాత్రం మువ్వాను సరెండర్‌ చేయాలనే నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను జిల్లా విద్యాశాఖ ద్వారా రహస్యంగా నడిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ నెల ఆరున మువ్వా రామలింగాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సరెండర్‌ చేస్తూ డైరెక్టర్‌ నుంచి ఉత్తర్వులు అందాయి. 

మువ్వాకు మంత్రి నారాయణ అండదండలు
మువ్వా రామలింగానికి మంత్రి నారాయణ అండదండలు ఉన్నాయి. ఆయన డీఈఓగా పనిచేస్తున్న సమయంలో నారాయణ విద్యాసంస్థలపై సానుకూల ధోరణిని అవలంబించారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సమయంలో నగరంలోని ధనలక్ష్మీపురంలో గల నారాయణ స్కూల్లో ఫిజిక్స్‌ పేపర్‌ను లీక్‌ చేశారు. ఈ వ్యవహారంలో నారాయణ యాజమాన్యానిదే పూర్తి బాధ్యత ఉన్నా, అప్పటి డీఈఓగా పనిచేసిన రామలింగం సదరు విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సస్పెండైనా, సరెండర్‌ చేసినా నెలలు తిరగకుండానే మళ్లీ అదే జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు.   

మరిన్ని వార్తలు