నేలబావిలో జారిపడి డైట్‌ విద్యార్థిని మృతి

22 Nov, 2018 07:58 IST|Sakshi
రేవతి మృతదేహం

లబోదిబోమంటున్న కుటుంబ సభ్యులు

విజయనగరం ,మక్కువ: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఎలాగైనా ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావాలని రాత్రీపగలూ కష్టపడి చదువుతోంది. తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలనుకున్న ఆమె ఆశలు నేలబావి రూపంలో గల్లంతయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొండబుచ్చమ్మపేటకు చెందిన తెర్లి రేవతి (22) డైట్‌ కోర్సు చేసి డీఎస్సీకి ప్రిపేర్‌ అవుతోంది. మంగళవారం సాయంత్రం దుస్తులు ఉతికేం దుకు గ్రామ సమీపంలోని నేలబావికి వెళ్లింది.

దుస్తులు ఉతికేందుకు నీరు తోడుతుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. ఆ సమయంలో సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో రేవతి బావిలో పడిపోయిన విషయం తెలి యలేదు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రేవతి తల్లిదండ్రులు అప్పలనాయుడు, వరలక్ష్మి పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. ఇంటివద్ద రేవతి కనిపించకపోవడంతో గ్రామంలో వెతికారు. అలా గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లగా రేవతి పాదరక్షలు, దుస్తులు కనిపించడంతో బావిలోకి టార్చిలైట్‌ వేసి చూడగా రేవతి మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తుల సహాయంతో బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై కె. కృష్ణప్రసాద్‌ బుధవారం ఉదయం గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాలూరు సీహెచ్‌సీకి తరలించారు.

కొండబుచ్చమ్మపేటలో విషాదఛాయలు..
అందరితో చనువుగా ఉండే రేవతి ఇక లేదనే తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు, తోటి విద్యార్థులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పలనాయుడు, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. రేవతి రెండో సంతానం. చదువులో చురుకుగా ఉండే రేవతి తప్పనిసరిగా ఉద్యోగం సాధిస్తుందనే నమ్మకం అందరిలోనూ ఉందని, ఈలోగా ఇలా జరిగిపోయిందని గ్రామస్తులు విషణ్ణవదనాలతో తెలిపారు.  

మరిన్ని వార్తలు