‘అదే వైఎస్‌ జగన్‌కు చంద్రబాబుకు ఉన్న తేడా’

20 Jan, 2019 12:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కలకత్తాలో జరిగిన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం గురించి గానీ, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేని దమ్ము ధైర్యంలేని పిరికిపంద, అసమర్దుడు సీఎం చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. అదే ఫెడరల్ ఫ్రంట్ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చర్చలు జరిపితే తొలి ప్రాధాన్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదా గురించే మాట్లాడారని తెలిపారు. అదే వైఎస్‌ జగన్‌కు చంద్రబాబుకు ఉన్న తేడా అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అబద్దపు ప్రచారాలు చేశారని ధ్వజమెత్తారు. వీటిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని, ఎల్లో మీడియా చేస్తున్న అబద్దపు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.

విజయవాడ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారథి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. 'కేటీఆర్, వైఎస్ జగన్ చర్చలు జరిపితే అది ఫిడేల్ ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు. కలకత్తాలో జరిగింది తోడేళ్ల ఫ్రంటా? వైఎస్ జగన్ కలుగులో దాక్కున్నారని మంత్రి దేవినేని ఉమ కళ్లులేని కబోదిలా మాట్లాడారు. సంవత్సరం మూడు నెలలపాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన వైఎస్ జగన్ ప్రజల హృదయాలలో ఉన్నారనే విషయం మరిచిపోయావా? ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు తంత్రాలు కుతంత్రాలు మొదలు పెట్టారు. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు చంద్రబాబును ఓడించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు.

వైఎస్‌ జగన్ నవరత్నాలు ప్రకటిస్తే వాటికి మన రాష్ట్ర బడ్జెట్ సరిపోదని మంత్రి యనమల ఎద్దేవా చేశారు. ఇప్పుడు వాటిలోని పింఛన్‌ పెంపు, డ్వాక్రామహిళల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు, రైతుబంధు పేరుతో ఇన్ పుట్ సబ్సిడీలను చంద్రబాబు ఇప్పుడు ప్రకటించారు. వీటిని నవరత్నాలలో నుంచి దొంగిలించి చంద్రబాబు ప్రకటించడమంటే అది వైఎస్‌ జగన్ విజయమే. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి కనీసం ఐదు వందల కోట్లు కూడా చెల్లించకుండా చికిత్సలు నిలిపివేసి, ఇప్పుడు ఐదులక్షల పెంపుదల ఎలా ఇస్తారు. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, పదివేలు అంటూ చంద్రబాబు తాయిలాలు ప్రకటిస్తున్నారు. వాటిని ఎల్లో మీడియా మసాలా వేసి మరీ ఆకర్షణీయంగా ప్రకటిస్తున్నాయి. యాదవ కార్పొరేషన్ కోసం వెళ్తే దాని గురించి సరైన హామీ ఇవ్వలేదు. నాయీబ్రాహ్మణులు ఆదుకోమని వెళ్తే వారిని తోకలు కత్తిరిస్తామని అవమానించాడు. ఈరోజు బీసీ నేతలను పిలిచి తాయిలాలు ప్రకటిస్తూ దొంగప్రేమ ఒలకబోస్తున్నాడు. వైఎస్ జగన్ బీసీల అధ్యయన కమిటీ పెట్టి వారికి ఏం కావాలో విస్తృత స్దాయిలో చర్చించారు. త్వరలో బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్న తరుణంలో చంద్రబాబు దొంగ ప్రేమలు నటిస్తున్నారు. బీసీలకు న్యాయం చేయగలిగేది వైఎస్‌ జగన్ మాత్రమే అని బీసీ వర్గాలు నమ్ముతున్నాయి' అని పార్థసారథి అన్నారు.

మరిన్ని వార్తలు