టీడీపీలో తారస్థాయికి విభేదాలు

2 Nov, 2014 03:27 IST|Sakshi
టీడీపీలో తారస్థాయికి విభేదాలు

 (సాక్షి ప్రతినిధి-విజయనగరం) : టీడీపీ జిల్లా నేతలు, నాయకులు, కార్యకర్తల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు  బయటపడే సమయం వచ్చేసింది. దీంతో ఎవరి స్థాయిని బట్టి వారు పెద్ద నాయకులపై ఫిర్యాదులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా మంత్రిపై ఇప్పటికే కొందరు అసంతృప్తితో గూడుపుఠాణి అయినట్టే  మరికొందరు కూడా పదవులనుభ విస్తున్న నాయకులపై గుర్రుగా ఉన్నారు. వీరిపై కేంద్ర మంత్రి అశోక్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకుంటున్న మంత్రి,  ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇతర నాయకులు పరస్పర ఆగ్రహావేశాలతో ఉన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృ ణాళినిపై జిల్లాలోని తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మె ల్యేలతో పాటు టీడీపీ నాయకులు కూడా ఆమె తీరు బాగా లేదని చెప్పేందుకు తమ అస్త్రాలను సిద్ధం చేశారు. కొన్ని విషయాల్లో తమకు అనుకూలంగా లేరని, దీనివల్ల ప్రజల్లో ఆశించిన స్థాయిలో పట్టు సాధించుకోలేకపోతున్నామని, అధికారుల వద్ద తమ మాట చెల్లుబాటు కావడం లేదని  చెప్పేందుకు పలు కారణాలను సిద్ధం చేసుకున్నారు.
 
 అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణలపై కూడా కొందరు కౌన్సిలర్లు, నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే గీత  ఆమెకు నచ్చిన  వారితోనే పనులు చేయిస్తున్నారని, మున్సిపల్ చైర్మన్ కూడా కార్యక్రమాల్లో స్పీడుగా లేరనీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, కౌన్సిలర్లు ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దగ్గర చెప్పేందుకు ఉత్సుకతతో ఉన్నారు. కానీ వారి ఆతృతకు తగ్గ ధైర్యం, అశోక్ ముందు నోరు విప్పే తెగువ చేయలేక తటపటాయిస్తున్నారు. ఎవరైనా ముందు ఫిర్యాదు చేస్తే చాలు ముందుకొచ్చి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఫిర్యాదుల సారాంశాన్ని బయటపెట్టాలని చూస్తున్నారు. వరుసగా క్యూ కట్టేసి తమ అంతరంగాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్న నాయకులు, కౌన్సిలర్లు అశోక్ వద్ద నోరు విప్పేందుకు జంకుతున్నారు.
 
 ఒక వేళ మనమే ముందువారిపై చెబితే అది సాధారణ ఫిర్యాదులా తేలిగ్గా తీసుకుంటే? ఆ తరువాత వారి వద్ద మనం చెడ్డయిపోతామన్న ఆందోళన వారిలో నెలకొంది. మరోవైపు కేంద్ర వుంత్రి అశోక్ ఎలా స్పందిస్తారోనన్న భయం కూడా వెన్నాడడంతో ఆయావర్గాలకు చెందిన నాయకులు నోరువిప్పేందుకు సంకోచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అశోక్ రాకముందు ఈ విషయమై ధైర్యంగా మాట్లాడినప్పటికీ ఆయన వచ్చాక మాత్రం మిన్నకుండిపోతున్నారు. దీంతో ఎవరి మానాన వారు అశోక్ బంగ్లాకు వెళ్తున్నారు, వస్తున్నారు తప్పితే ఎక్కడా ఫిర్యాదులు చేసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే వారి ఆతృతను, అంతరంగాన్ని అశోక్ గుర్తించి పరిష్కరిస్తారా? లేక వీరే అశోక్ ముందు పంచాయితీ పెట్టిస్తారా? అన్నది వేచి చూడాలి. ఎందుకంటే కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మరో రెండు రోజులు మాత్రమే జిల్లాలో ఉండనున్నారు. ఈ నెల నాలుగున ఆయన ఢిల్లీ వెళ్తారు కనుక ఈ సమయాన్ని తెలుగు తమ్ముళ్లు సద్వినియోగం చేసుకుని తమ అసంతృప్తులను వెళ్లగక్కుతారా? లేక అశోక్ గజపతిరాజే వీరిని పిలిపించి వారి అంతర్గత విభే దాలకు ఫుల్‌స్టాప్ పెడతారా అన్నది వేచి చూడాలి.
 

మరిన్ని వార్తలు