కష్టం.. నష్టం..

3 Mar, 2015 02:45 IST|Sakshi

లింగాల : వరుస కరువులతో పండ్ల తోటల రైతులు విలవిల్లాడిపోతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. వర్షాలు వస్తాయని నమ్మి సాగు చేసిన పంటలు ఎండిపోవడం చూడలేక రైతులు తలలు తాకట్టు పెట్టి అందిన చోటల్లా అప్పులు చేసి బోరుబావుల తవ్వకాలను చేపడుతున్నారు. పాతాళ గంగను బయటికి తీసైనా పంటలను కాపాడుకోవాలన్న మొండి ధైర్యంతో బోరుబావుల తవ్వకాలను చేపట్టిన రైతులు నిలువునా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

రామనూతనపల్లె గ్రామానికి చెందిన రైతు తుమ్మలూరు ఈశ్వరరెడ్డి తనకున్న 35ఎకరాల పొలంలో గత 15ఏళ్ల క్రితం ఊట బావుల సాయంతో పంటలను సాగు చేసేవారు. వ్యవసాయంలో అధునాతన ఒరవడి రావడంతో నాలుగైదు బోరుబావులను 500అడుగుల లోతు తవ్వి పంటలను సాగు చేశాడు. అయితే ప్రతి ఏడాది భూగర్భజలాలు తగ్గుతూ వచ్చాయి. దీనికితోడు బోరుబావులు లోతు తవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. 15 ఏళ్ల నుంచి 125 బోరుబావులను తవ్వించాడు.
 
ఈ ఏడాది అత్యధికంగా 10 బోరుబావులను 1500 అడుగుల లోతు వరకూ తవ్వించాడు. బోరుబావుల తవ్వకానికి ఏకంగా రూ. 22 లక్షలు వెచ్చించాడు. అయినా ప్రయోజనం చేకూరలేదు. 5 బోరుబావుల్లో అరకొరగా భూగర్భజలాలు లభించాయి కానీ తనకున్న 34 వేల అరటి చెట్లకు నీరు సరిపడడంలేదు.
 
మండుతున్న ఎండలకు గెలలు వేసిన అరటి చెట్లు కాయలు పక్వానికి రాకముందే వాలిపోతున్నాయి. ఈ ఏడాది బోరుబావుల తవ్వకానికి  రూ. 22లక్షలు, పంటల సాగుకు రూ. 40 లక్షలు వెచ్చించారు. అయినా భూగర్భజలాలు పుష్కలంగా లేకపోవడంతో రూ. 62 లక్షలు నష్టపోవాల్సి వస్తోందని వేదన చెందుతున్నాడు.
 
అప్పుల ఊబిలో కూరుకుపోయాను..
వర్షం వస్తుందని నమ్మి 35 ఎకరాలలో గత ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో అరటి పంటను సాగు చేశాను.  ఈ ఏడాది పదునుపాటి వర్షం కూడా కురవలేదు. ఉన్న బోరుబావుల్లో నీరు ఇంకిపోయాయి. ఒక్కో బోరుబావి 1500ల అడుగుల లోతు వరకూ  తవ్వించినా నీటి జాడ లేదు. అప్పులు మాత్రమే మిగిలాయి. ఇలాంటి పరిస్థితులలో వ్యవసాయం రైతుల పాలిట భారంగా మారింది.     
- తుమ్మలూరు ఈశ్వరరెడ్డి, అరటి రైతు, రామనూతనపల్లె

మరిన్ని వార్తలు