అందుబాటులో ఉన్నా.. అందనంత దూరం

10 Sep, 2017 02:47 IST|Sakshi
అందుబాటులో ఉన్నా.. అందనంత దూరం
- ఆరోగ్యశ్రీపై రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు కష్టాలు
- పెద్దలకు మాత్రమే అందుతున్న ‘నిమ్స్‌’ వైద్యసేవలు
 
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన వెంకటప్ప కుటుంబంతో సహా ఇటీవలే హైదరాబాద్‌కు వలస వచ్చాడు. మోతీనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వారం కిందట ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్‌ వైద్య సేవ) కార్డు పట్టుకుని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే అనంతపురానికి చెందిన ఆరోగ్య శ్రీ కార్డు ఇక్కడ చెల్లదని, ఏపీ వెళ్లి వైద్యం చేయించుకోవాలని నిమ్స్‌ సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో వెంకటప్పకు ప్రాణం పోయినంత పనైంది. చివరకు అపార్టుమెంట్‌ వాసులే స్పందించి తలాకొంత సాయం చేసి వైద్యం చేయించారు. ఇది అతనొక్కడి సమస్యే కాదు.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఎక్కడో ఓ చోట నిత్యం ఏపీ ప్రజలకు ఎదురవుతున్న దుస్థితి ఇది. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కావడం.. ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో రాష్ట్రానికి చెందిన అనేక మంది హైదరాబాద్‌ వెళ్లి బతుకు వెళ్లదీస్తున్నారు. ఏపీలోని స్వగ్రామాల్లో ఆరోగ్య శ్రీ కార్డులున్న ఇలాంటివారు హఠాత్తుగా జబ్బుల బారినపడితే.. అక్కడి ఆస్పత్రులు మొహం మీదే తలుపులేస్తున్నాయి. అలాగని అక్కడి ఆస్పత్రులను తప్పుబట్టడానికి లేదు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలే ఇందుకు కారణం. తమ రాష్ట్ర వాసులకు ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద హైదరాబాద్‌లో వైద్యమందించొద్దని రాష్ట్ర సర్కార్‌ ఆదేశాలివ్వడంతోనే అక్కడి ఆస్పత్రులు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి.   
 
పెద్దలకు ఓకే..
ఏపీ నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లిన పేదలకు ఎన్టీఆర్‌ వైద్య సేవ కుదరదన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి పెద్దలు మాత్రం నిమ్స్‌లో వైద్య సేవలు పొందేందుకు అనుమతించడం ద్వారా తన ద్వంద్వ నీతిని చాటుకుంది. ఈ తీరును వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం తప్పుబడుతున్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం ఆరోగ్యశ్రీని యథాతథంగా అమలు చేసి ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు