విద్యార్థులకు అండగా డిజిటల్‌ విద్యా వేదికలు

26 Mar, 2020 04:41 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో ఇంటి దగ్గర నుంచే చదువులు 

వాట్సాప్, స్కూల్‌ యాప్‌ల ద్వారా పిల్లలకు పాఠాలు 

ఇంటి నుంచే వాటిని నేర్చుకునేలా ఏర్పాట్లు 

డిజిటల్‌ విధానంలోనే పరీక్షల నిర్వహణ 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున ఇళ్లలో ఉంటున్న విద్యార్థుల చదువులకు ఉపయుక్తంగా ఉండేలా పలు పాఠశాలలు డిజిటల్‌ విద్యా వేదికలను వినియోగిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా పిల్లలకు పాఠ్య బోధన చేస్తున్నాయి. పలు పాఠశాలలు.. తమ సొంత స్కూల్‌ యాప్‌లతోనూ, మరికొన్ని వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాయి. రాష్ట్రంలో అన్ని  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో  5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల రెండో వారంలోనే సంవత్సరాంత (సమ్మేటివ్‌–2) పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఇంకా సంవత్సరాంత పరీక్షలు పెట్టలేదు. ఈ తరుణంలో కోవిడ్‌తో పాఠశాలలు మూసివేయడంతో పిల్లలు, టీచర్లు ఇళ్ల వద్దనే ఉంటున్నారు. పిల్లలకు అవసరమైన పాఠాలను అందించడంతోపాటు పరీక్షలకు సన్నద్ధం చేయడానికి పాఠశాలలు ఆన్‌లైన్‌ వేదికలను వినియోగించుకుంటున్నాయి.  

పరీక్షలూ ఇదే మార్గంలో.. 
- పాఠశాలలు పిల్లలతో తరగతుల వారీగా వాట్సాప్‌లో గ్రూపులు ఏర్పాటు చేశాయి. డిజిటల్‌ విద్యావేదికల ద్వారా నూతన అంశాలను నేర్చుకునేలా మార్గనిర్దేశం చేస్తున్నాయి. 
- పాఠశాలల్లో సాంప్రదాయిక పద్ధతుల్లో పాఠాలు చెబుతున్నా ఇటీవలి కాలంలో ప్రభుత్వం డిజిటల్‌ పాఠాల బోధనకు కూడా సదుపాయాలు కల్పించిన సంగతి తెలిసిందే. ఇటువంటి పాఠాలను వేర్వేరు డిజిటల్‌ వేదికల ద్వారా ఇంటినుంచే నేర్చుకునేలా పాఠశాలలు టీచర్ల ద్వారా సూచనలు చేయిస్తున్నాయి. 
- ఇప్పటికే పాఠశాలల్లో డిజిటల్‌ విధానంలో పాఠాలకు అలవాటు పడి ఉన్న విద్యార్థులు తమ ఇళ్లల్లో కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను ఏర్పాటు చేసుకొని టీచర్లు సూచించినట్టు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యసనాన్ని కొనసాగిస్తున్నారు. సోషల్‌ నెట్‌వర్కులు, కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆయా సబ్జెక్టుల వారీగా సమాచారాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నాయి. ∙ఆ పాఠాలను ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా