పరువు ప్రతిష్ట

3 Aug, 2014 01:07 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(కేడీసీసీబీ)పై పట్టుకు తెలుగుతమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. ప్రస్తుత చైర్మన్ కాంగ్రెస్ నేత కావడంతో.. అధికార బలంతో కైవసం చేసుకునేందుకు టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది. తాజా పరిణామాలను పరిశీలిస్తే.. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చైర్మన్ పదవిని సవాల్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పరువు కోసం ఒకరు.. ప్రతిష్ట కోసం మరొకరు బరిలోకి దిగుతున్నట్లు చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే టీడీపీ నేతలు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నట్లు సమాచారం.
 
 ఆ సందర్భంగా పాలకవర్గంపై అవిశ్వాసం పెట్టే విషయమై చర్చించనున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. టీడీపీకి ఎంత మంది డెరైక్టర్లు మద్దతిస్తారనే విషయంలో స్పష్టత ఆధారంగా బుధవారం లోపు అవిశ్వాసానికి నోటీసు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలాఉంటే నోటీసుకు ముందే టీడీపీ నేతలు క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. కొందరు డెరైక్టర్లను ఇప్పటికే క్యాంపులకు తరలించినట్లు తెలిసింది. కర్నూలు జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పాలకవర్గానికి 2013లో ఎన్నిక నిర్వహించారు. వివిధ సహకార సంఘాల నుంచి 21 మంది డెరైక్టర్లు ఎన్నికయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 16 మందికి పైగా ఆ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు.
 
 మిగిలిన గొర్రెలు, చేనేత సంఘాలు, హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా ఐదుగురు డెరైక్టర్లు కూడా కాంగ్రెస్‌కు అనుకూలురే విజయం సాధించారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అండతో చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే డెరైక్టర్లుగా ఉన్న కాంగ్రెస్ నేతలు కొందరు ఒకప్పుడు టీడీపీ నేతలకు అనుచరులుగా ఉన్నారు. మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులు ప్రస్తుతం టీడీపీలో ఉన్నందున డెరైక్టర్లతో బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం. లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో కొందరు ఇష్టం లేకపోయినా మద్దతిచ్చేందుకు సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. అయితే మాజీ మంత్రి కోట్ల కేడీసీసీబీపై పట్టును కొనసాగించేందుకే నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ మేరకు టీడీపీకి మద్దతిస్తున్న డెరైక్టర్ల వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు వినికిడి. ఓ మాజీ మంత్రి ఎమ్మెల్సీ కోసమే జెడ్పీని, కేడీసీసీబీని టీడీపీకి కట్టబెట్టే విషయంలో శ్రద్ధ పెట్టినట్లు తెలుసుకున్న కోట్ల ఆయన ఎత్తులను చిత్తు చేసేందుకు రంగంలోకి దిగినట్లు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
 
 తమ ‘చేతి’లోని కేడీసీసీబీ చైర్మన్ పదవిని కోల్పోతే జిల్లాలో పెద్దాయనకు విలువుండదని.. ఎట్టి పరిస్థితుల్లో చేజారనివ్వకూడదని కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగా ప్రయత్నిస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ పెట్టబోయే అవిశ్వాసం వీగిపోయేలా చేసేందుకు కాంగ్రెస్ నేతలంతా ఒక్కటైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేడీసీసీబీపై ఎవరు పట్టు సాధిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
 

మరిన్ని వార్తలు