సినీరంగం పరిస్థితి బాగోలేదు

10 May, 2015 13:52 IST|Sakshi
సినీరంగం పరిస్థితి బాగోలేదు

ఏలూరు : సినీరంగం పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని, వ్యవస్థ మారాల్సి ఉందని, థియేటర్ల అద్దెలు, తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని శనివారం ఆయన సతీమణి భారతి, మనమడు బబ్లిలతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
 
 ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సినీరంగం అభివృద్ధికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఇప్పటివరకు 93 చిత్రాలకు దర్శకత్వం వహించినట్లు తెలిపారు. కలియుగం దైవం శ్రీవారి ఆశీస్సులు ఉంటే మరిన్ని మంచి చిత్రాలకు దర్శక త్వం వహిస్తానని తెలిపారు. చిరంజీవితో ఖైదీ, రాక్షసుడు, పసివాడి ప్రాణం, ఛాలెంట్, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఇలా 27 చిత్రాలు, నందమూరి బాలకృష్ణతో 16 చిత్రాలు తీసినట్లు తెలిపారు.
 
 జంగారెడ్డిగూడెం ప్రాంతం అంటే తనకు ఎంతో ఇష్టమని, ముఖ్యంగా తిరుపతిలో ప్రసిద్ధిగాంచిన ఏడుకొండల వలే పారిజాతగిరి కొండలు కూడా ఉండటం అద్భుతమన్నారు. కోదండరామిరెడ్డికి ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు వేద ఆశ్వీరచనాలు అందజేసి దుశ్శాలువాతో సత్కరించారు. ప్రముఖులు బొమ్మారెడ్డి నాగ చంద్రారెడ్డి, మండవ లక్ష్మణరావు, రాజాన సత్యనారాయణ, పెనుమర్తి రామ్‌కుమార్, నంబూరి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు