-

'బాబు బంగారం' యూత్‌కు కనెక్టయితే హిట్టే

8 Mar, 2016 02:29 IST|Sakshi
'బాబు బంగారం' యూత్‌కు కనెక్టయితే హిట్టే

సినీ దర్శకుడు మారుతి
చిన్న సినిమాలు తీసి పెద్ద హిట్లు కొట్టి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు మారుతి. వరుసగా ఐదు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన తన సక్సెస్ సీక్రెట్‌ను చెప్పారు. యూత్ ఆలోచనలకు దగ్గరగా సినిమా ఉంటే హిట్టు గ్యారంటీ అని అన్నారు. ప్రస్తుతం తన పంథాను విడిచి పెద్ద హీరో అయిన వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న మారుతి.. భట్లపాలెం బీవీసీ కళాశాలలో జరుగుతున్న హోరైజన్-2కే16 ముగింపు ఉత్సవాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
- అమలాపురం రూరల్

 
‘‘మచిలీపట్నంలో డిగ్రీ చదివాను. నేమ్ బోర్డులు తయారు చేసేవాడిని. కంప్యూటర్ యానిమేషన్ కోర్సు చేసి హైదరాబాద్ వెళ్లాను. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈరోజుల్లో... బస్టాప్ వంటి లో బడ్జెట్ సినిమాలు తీశాను. అవి మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. దాంతో నిలదొక్కుకున్నాను. నాదంటూ ట్రెండ్ ఏమీ ఉండదు. మనం తీసిన సినిమా ప్రేక్షకులకు కనెక్టయితే తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రస్తుతం హీరో వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ సినిమా తీస్తున్నాను.

షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉంది. త్వరలోనే యానిమేషన్ చిత్రాలు తీయాలనుకుంటున్నాను. దర్శకుల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్, జంధ్యాల, ప్రస్తుత తరంలో రాజమౌళి అంటే ఇష్టం. ఇక నాకంటూ ఓ స్టైల్ ఉంది. దానితోనే సక్సెస్ అవుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. వారితో కలిసి పనిచేశాను. కెరీర్‌లో స్థిరపడాలంటే యువత లక్ష్యం నిర్దేశించుకోవాలి. మనం ఏం చేస్తున్నా.. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సక్సెస్ అవుతాం.’’

మరిన్ని వార్తలు