దర్శక, నిర్మాతలే అసలైన హీరోలు

25 Apr, 2018 13:47 IST|Sakshi
జీవా

కమెడియన్‌గా మార్చింది దర్శకుడు వంశీనే

నాటక రంగం నుంచే సినిమాల్లోకి

విలక్షణ నటుడు జీవా  

రాయవరం (మండపేట) : సినీ రంగంలో విలన్‌గా జీవితాన్ని ప్రారంభించి.. అనంతరం కమెడియన్‌గా, క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా సత్తా నిరూపించుకున్న ఘనత ప్రముఖ నటుడు జీవాకే దక్కుతుంది. సుదీర్ఘ కాలంగా నటుడిగా కొనసాగుతున్న ఆయన ఊపిరి ఉన్నంత వరకూ నటుడిగానే కొనసాగుతానని అంటున్నారు. తన దృష్టిలో దర్శక, నిర్మాతలే అసలైన హీరోలంటున్న జీవా మంగళవారం రాయవరం సాయితేజా విద్యానికేతన్‌ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

నాటక రంగం నుంచే సినిమాల్లోకి వచ్చాను. పేపరులో వచ్చిన ప్రకటన చూసి, నా స్నేహితులు ఫొటోలు పంపించారు. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ ఎంపిక చేసి, ‘తొలికోడి కూసింది’ సినిమాలో తొలి అవకాశం కల్పించారు. ఆ సినిమా షూటింగ్‌ జిల్లాలోని దోసకాయలపల్లిలో జరిగింది. అలా జిల్లాతో అనుబంధం ఏర్పడింది. నన్ను గుర్తించి, ప్రోత్సహించిన దర్శకుడు బాలచందర్‌పై ఉన్న గౌరవంతో ఆయన పేరును నా రెండో కుమారుడికి పెట్టుకున్నాను.

అతడు కూడా దర్శకత్వ శాఖలోనే పని చేస్తూ సినిమా తీసే సన్నాహాల్లో ఉన్నాడు. అప్పటివరకూ విలన్‌గా నటిస్తున్న నన్ను కమెడియన్‌గా మార్చింది ప్రముఖ దర్శకుడు వంశీనే. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో తొలిసారిగా కమెడియన్‌ పాత్ర చేశాను. అది హిట్టవడంతో అక్కడి నుంచి కమెడియన్‌ పాత్రలు ఎక్కువగా చేస్తున్నాను. క్యారెక్టర్‌ ఆర్డిస్టుగా కూడా రాణిస్తున్నాను. ఇప్పటివరకూ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు వెయ్యి వరకూ చిత్రాల్లో నటించాను.

ప్రస్తుతం ఇంకా పేరు పెట్టని నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నాను. సినిమాల్లో కొన్ని పాత్రలు నాకు పేరు తెచ్చి పెట్టాయి. ‘భరత్‌ అనే నేను’ సినిమాలో విద్యాశాఖ మంత్రి పాత్రకు మంచి పేరు వచ్చింది.∙ఎవ్వరైనా, ఏ వృత్తిలోనైనా పరిపూర్ణత సాధించడానికి జీవితకాలం చాలదు. నటుడికి తృప్తి ఉండదు. అవకాశం ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటాను.

చిన్నప్పుడు ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు సినిమాలు అధికంగా చూసేవాడిని. నేను నటించిన సినిమాలు మాత్రం చూడను. ‘గులాబి’ సినిమా మాత్రమే నా భార్యతో కలిసి చూశాను. అదే తొలి, చివరి సినిమా. నటించడమే తెలుసు కానీ, నటించిన సినిమాలు మాత్రం చూసే అలవాటు లేదు. 
 

మరిన్ని వార్తలు