తారస్థాయికి ‘దేశం’ విభేదాలు !

14 Jul, 2014 03:23 IST|Sakshi
తారస్థాయికి ‘దేశం’ విభేదాలు !

శ్రీకాకుళం:వర్గ విభేదాలకు మారుపేరైన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకు ల్లో ఏమాత్రం మార్పురాలేదు. పలువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. తొలి నుంచి జిల్లాలో కింజరా పు, కళావర్గాలు పై చేయి కోసం ప్రయత్నిస్తూనే వచ్చాయి. కింజరాపు ఎర్రన్నాయుడు మరణం తరువాత కళా వెంకటరావు వర్గానిది పైచేయి అవుతుందని అందరూ భావించారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు.. కింజరాపు వర్గానికి పెద్దపీట వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రితో పాటు జెడ్పీ చైర్మన్, విప్ తదితర పదవులన్నీ కింజరాపు వర్గానికే దక్కాయి. కళా వెంకటరావు టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పీఆర్పీలో చేరడంతో చంద్రబాబు ఆయనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండడంతో కింజరాపు వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
 
  దీంతో తీవ్ర అసహనంతో ఉన్న కళావర్గం కింజరాపు వర్గాన్ని ఏమీ చేయలేక మాజీ స్పీకర్ ప్రతిభా భారతిపై దృష్టి సారించారు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కళావర్గంతో పాటు మాజీ స్పీకర్ భారతి వర్గం కూడా పార్టీ అధినేతకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చాయి. తన ఓటమికి కారణం కళా వర్గమేనని ప్రతిభా భారతి ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తాజాగా భారతి వర్గానికి చెందిన పీఎసీఎస్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావును అవిశ్వాసం ద్వారా దించాలని కళా వర్గం ప్రయత్నిస్తోంది. సొంత పార్టీకి చెందిన నాయకులపైనే అవిశ్వాసానికి పూనుకోవడంపై ప్రతిభా భారతి ఆగ్రహంతో ఉన్నా.. చేసేది లేక లోలోనే దిగమింగుకుంటూ వచ్చారు. విషయాన్ని మంత్రి అచ్చెన్న దృష్టికి కూడా తీసుకువెళ్లడంతో ఆయన ఈ వ్యవహారంలో తలదూర్చారు.
 
 పార్టీ ప్రతిష్ట అంటూ కళావర్గం ఎత్తుగడలను అడ్డుకోవాలని నిర్ణయించి అవిశ్వాసం నోటీసు వచ్చినా చర్యలు తీసుకోకుండా ఉండేలా అధికారులతో మాట్లాడినట్టు భోగట్టా. ఈ విషయం తెలుసుకున్న కళావర్గం మండిపడుతోంది. తమ ప్రాంతంలో అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవడంపై ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అచ్చెన్న మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి దీన్ని అడ్డుకుంటానని చెప్పడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. దీంతో అచ్చెన్నాయుడు ప్రత్యక్షంగానే అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇది కళావర్గంపై పుండు మీద కారం చల్లినట్లైంది. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు ముగ్గురు నాయకులు హైదరాబాద్ వెళ్తున్నట్టు సమాచారం. మాజీ స్పీకర్ ప్రతిభాభారతికి మంత్రి అండ దొరకడంతో కళా వెంకటరావుపై మరోసారి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీకి చెందిన వ్యక్తిపైనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారం భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.
 

మరిన్ని వార్తలు