గురుకులంలో.. కలకలం!

2 Nov, 2013 04:56 IST|Sakshi


 అదో గురుకులం.. ప్రశాంతతకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఆ గురుకుల వాతావరణాన్ని అంతర్గత విభేదాలు.. ప్రిన్సిపాల్ బోధకుల మధ్య ఆధిపత్య రాజకీయాలు కలుషితం చేశాయి. యథా రాజ.. తథా ప్రజ అన్న నానుడిని నిజం చేస్తూ ఎక్కడెక్కడి నుంచో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల మధ్య వైషమ్యాలు, తారతమ్యాలు సృష్టించాయి. చివరికి అవి శృతి మించి ఒక విద్యార్థిపై హత్యాయత్నానికి దారితీశాయి. తమ మాట వినడం లేదన్న అక్కసుతో ఇద్దరు విద్యార్థులు రిహార్సల్స్ చేసి మరీ తమ జూనియర్ విద్యార్థిని బావిలోకి తోసేశారంటే.. వారిలో విషబీజాలు ఎంతగా నాటుకున్నాయో అర్థమవుతుంది.
 
 ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్:
 షేర్‌మహ్మద్‌పురం(ఎస్.ఎం.పురం) గురుకులం. ఒకనాడది ర్యాంకులకు పెట్టింది పేరు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన గురుకులం. నేడదే సంస్థ వివాదాల రొంపిలో చిక్కుకుంది. ఉపాధ్యాయుల మధ్య రాజుకున్న విభేదాలు, ఆధిపత్య రాజకీయాల రొచ్చు అభం శుభం తెలియని విద్యార్థుల్లో విషబీజాలు నాటింది. ఆధిపత్య ధోరణిని పెంచింది. మాట వినని వారిని మట్టుబెట్టేయాలన్నంత  వికృత చేష్టలకు పురిగొల్పింది. చివరికి అంత పనీ జరిగింది. ఒక జూనియర్ విద్యార్థిని సీనియర్లు బావిలోకి తోసేశారు. అదృష్టవశాత్తు అతను బతికి బయటపడ్డాడు గానీ.. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. గురుకుల పాఠశాలలో దశాబ్దాల తరబడి బదిలీల్లేకుండా పాతుకుపోయిన ఉపాధ్యాయులు బోధన కంటే ఆధిపత్య ఆరాటమే ఎక్కువైంది. విభేదాలు ముదిరాయి. సంస్థను గాడిలో ఉంచాల్సిన ప్రిన్సిపాల్‌ను సైతం లెక్కచేయని స్థితికి చేరుకున్నారు. చివరికి నైట్ వాచ్‌మన్ మద్యం తాగి రాత్రిపూట విధులకు రాకపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ విద్యార్థుల పై తీవ్ర ప్రభావం చూపాయి. తోటి విద్యార్థిని మట్టుబెట్టే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.
 
 మాట వినడం లేదని..
 గురుకులంలో కొత్తగా చేరిన ఐదో తరగతి విద్యార్థి బల్లా కోటీశ్వరరావు తమ మాట వినడం లేదని, చెప్పిన పనులు చేయడం లేదని 8వ తరగతికి చెందిన భానుప్రకాష్, మనోహర్ అనే విద్యార్థులు కక్షగట్టారు. అతన్ని ఎలాగైనా చంపేయాలని భావించారు. దాని కోసం రెండురోజుల ముందు రిహార్సల్స్ కూడా చేశారు. పథకం ప్రకారం గురువారం రాత్రి కోటీశ్వరరావును సమోసాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లారు. కొద్ది దూరంలో ఉన్న మంచినీటి బావి వద్దకు వెళ్లగానే.. అందులో కర్ర పడిపోయింది, తీయమని చెప్పి కోటీశ్వరరావును చేతులతో పట్టుకొని బావిలోకి దించి.. అంతలోనే వదిలేశారు. నూతిలోకి జారిపోతున్న కోటీశ్వరరావు చేతికి అదృష్టవశాత్తు బావిలో ఏర్పాటు చేసిన రాతి మెట్టు ఒకటి చిక్కడంతో దాన్ని పట్టుకుని వేలాడుతూ.. ఏడుస్తూ కేకలు వేశాడు. అదే సమయంలో బహిర్భూమికి అటువైపు వచ్చిన కొందరు గ్రామస్తులు అరుపులు విని బావి వద్దకు వచ్చారు. గొంటి గరికివాడు అనే వ్యక్తి బావిలో ఉన్న విద్యార్థిని అతికష్టం మీద బయటకు తీసుకొచ్చాడు. బావిలో సుమారు గంటసేపు నరకయాతన అనుభవించిన కోటీశ్వరరావు, విలపిస్తూ జరిగిన విషయం చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వచ్చి బాధితుడిని తిరిగి పాఠశాలకు చేర్చారు. ఆ సమయంలోనూ నైట్ వాచమణ సంపతిరావు కోటేశ్వరరావు పాఠశాలకు రాలేదు. దాంతో ఫోనులో ప్రిన్సిపాల్‌కు సమాచారం చేరవేశారు.
 
 ప్రిన్సిపాల్ నిలదీత
 శుక్రవారం ఉదయం ఎడు గంటలకు మాజీ సర్పంచి అలికాన భాస్కర రావు, మాజీ ఎంపీటీసీ దుంగ ఆదినారాయణ, ముద్దాడ రాంబుజ్జి, గురుగుబెల్లి బాలకృష్ణ తదితరులు గురుకులానికి వచ్చారు. 7.30 గంటలకు ప్రిన్సిపాల్ బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, ఇతర ఉపాధ్యాయులు వచ్చారు. జరిగిన సంఘటనపై గ్రామస్తులు ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా వారి మధ్య తావ్ర వాగ్వాదం జరిగింది. ఇంత జరుగుతున్నా అక్కడి ఉపాధ్యాయులు మౌనం చూస్తూ నిలబడ్డారే తప్ప ఏమాత్రం జోక్యం చేసుకోలేదు.  దీంతో ప్రిన్సిపాల్ వారిపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్తులు నిలదీస్తుంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ మధ్య ఉన్న విభేదాలు స్పష్టంగా బయట పడ్డాయి. బాధిత విద్యార్థితోపాటు తోసేసిన విద్యార్థుల్లో ఒకరిని ఒక గదిలో ఉంచిన ప్రిన్సిపాల్ ఏపీ గురుకుల కార్యదర్శి బి.శేషుకుమారికి సమాచారం అందించారు. సెక్రటరీ సూచన  మేరకు తదుపరి  చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతానికి సంఘటనకు బాధ్యులైన ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు మాత్రం నైట్‌వాచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందకపోవడం విశేషం.
 
 ప్రాణాలు పోతాయనుకున్నాను
 సమోసా తినిపిస్తామని తీసుకెళ్లారు. గురుకులం ముందు ఉన్న బావిలో కర్ర పడిందని తీయమన్నారు. చేతులు పట్టుకుని దించుతూ మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. నూతిలో పడిన నేను  మెట్టు పట్టుకుని ఉండి పోయాను. కేకలు పెట్టటంతో గ్రామస్తులు స్పందించి బయటకు తీశారు. గంటసేపు నరకయాతన పడ్డాను. ప్రాణాలు పోతాయనుకున్నాను.
 -బల్లా కోటేశ్వరరావు, బాధిత విద్యార్థి
 
 చర్య తీసుకోవటం నాచేతిలో లేదు
 నైట్ వాచ్‌మన్‌ను అనేకసార్లు హెచ్చరిం చాం. అయినా మార్పు లేదు. నేరానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులు విషయం గురుకుల సొసైటీ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లాం. వారు స్పందించి చర్య తీసుకోవా లే తప్ప నాకు ఆ అధికారం లేదు. పాఠ శాలలో మరుగు దొడ్లు లేకపోవటం వల్ల విద్యార్థులు తరచూ బయటకు వెళుతున్నారు. వారిని అదుపు చేయలేక            పోతున్నాం.
 -బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్
 

మరిన్ని వార్తలు