జీవీకేపై కేసుకు అనుమతివ్వండి

29 Nov, 2013 02:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  విద్యుత్ సరఫరా చేయకున్నా... స్థిర చార్జీల పేరుతో కోట్లు కొల్లగొడుతున్న జీవీకేపై చర్యలకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎట్టకేలకు సిద్ధమయ్యాయి. జీవీకేపై సీఐడీలో క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కేసు నమోదు చేస్తామని డిస్కంల ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ సరఫరా చేయనప్పటికీ.. బ్యాంకుకు డిస్కంలు ఇచ్చిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీ)ను చూపించి జీవీకే ఇప్పటికే రూ.90 కోట్లను తీసుకుంది. తాజాగా మరో రూ.65 కోట్లను కొల్లగొట్టేందుకు కూడా సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఏదైనా సంస్థపై సీఐడీ విచారణ దిశగా చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమైనందున డిస్కంలు ఈ మేరకు లేఖ రాశాయి.
 
 విద్యుత్ ఇవ్వకున్నా డబ్బులివ్వాల్సిందేనట!
 జీవీకే గ్యాసు ఆధారిత విద్యుత్ ప్లాంటుతో డిస్కంలు 1999లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం డిస్కంలు 85 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) మేరకు స్థిర చార్జీలను (ఫిక్స్‌డ్ చార్జీలు) ప్రతినెలా జీవీకేకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 85 శాతానికి తగ్గినా, పెరిగినా ఆ లెక్కలను ఏడాది చివరన సర్దుబాటు చేసుకునేలా ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ప్రతినెలా బ్యాంకు ద్వారా స్థిరచార్జీలు చెల్లించే విధంగా డిస్కంలు జీవీకేకు ఎల్‌సీలు జారీచేశాయి. అయితే గత ఏడాది నుంచి రోజురోజుకీ గ్యాస్ సరఫరా తగ్గిపోతోంది. గత మార్చి 1 నుంచి గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
 
 ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశమే లేదు. అయినప్పటికీ స్థిర చార్జీల రూపంలో తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని జీవీకే పట్టుబడుతోంది. అలా కుదరదని డిస్కంలు వాదిస్తుండగా.. ఎల్‌సీలను చూపిస్తూ తమకు డబ్బు ఇవ్వాల్సిందిగా బ్యాంకు సిబ్బందిపై పై స్థాయి నుంచి ఒత్తిళ్తు తెస్తోంది. మొదట తమకు డబ్బులు చెల్లించాల్సిందేనని ఆర్థిక సంవత్సరం చివర్లో లెక్కలు చూసుకుందామని జీవీకే అంటున్నట్టు సమాచారం. విద్యుత్ సరఫరా చేయనప్పటికీ రూ.210 కోట్లు ఇవ్వాలంటున్న జీవీకే ఇప్పటివరకు రూ.90 కోట్ల మేరకు అక్రమంగా ఎల్‌సీలతో బ్యాంకు నుంచి నగదు డ్రా చేసిందని డిస్కంల వర్గాలు పేర్కొంటున్నాయి. మరో రూ.65 కోట్లు డ్రా చేసేందుకు కూడా ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. గ్యాసు లేక విద్యుత్ ఉత్పత్తి జరగని నేపథ్యంలో జీవీకే  డబ్బులు డ్రా చేయడంపై కేసు నమోదుకు డిస్కంలు సిద్ధపడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు