వివక్షకు కేరాఫ్‌ ‘మాన్సాస్‌’

4 Jul, 2019 09:14 IST|Sakshi

బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్న ఉద్యోగులు

దళితులకు కీలకపదవులు ఇవ్వకుండా కోర్సుల రద్దు

రాజరికాలు పోయినా... వారి సంస్థలో మాత్రం ఆ పోకడలు కొనసాగుతున్నాయి. అక్కడ వారి మాటే వేదం... వారు చెప్పిందే శాసనం. కాదని ఎవరైనా ఎదురు తిరిగితే వారి బతుకు బస్టాండే. ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్నా... దయనీయమైన వేతనాలే అందుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే... వారి విభాగానికి ఎసరు పెడుతున్నారు. ఉన్న ఉద్యోగం కాస్తా తీసేసి నడిరోడ్డుకు నెట్టేస్తున్నారు. దళితులకు ఎక్కడ కీలకపదవులు ఇవ్వాల్సి వస్తుందోనని వారి ఆధ్వర్యంలోని కోర్సును రద్దు చేసేస్తున్నారు. ప్రజల దృష్టిలో సేవ చేస్తున్నామని చెప్పుకోవడానికి... ప్రభుత్వానికి తమ ఆస్తులు అందనీయకుండా చేయడానికి... జయనగరం రాజులు నడుపుతున్న మాన్సాస్‌లో ఈ విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది.

సాక్షి , విజయనగరం : విజయనగరంలోని మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక విద్యాసంస్థల్లో మహారాజా పోస్టు గ్యాడ్యుయేట్‌ కళాశాల ఒకటి. దానిలో 14 విభాగాలు ఉన్నాయి. అందులో బోధన, బోధనేతర సిబ్బంది మొత్తం 50 మంది వరకు ఉన్నారు. మహారాజా పోస్టు గ్రాడ్యూయేట్‌ కళాశాల పేరుతో 1996 జూన్‌ 30న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మాన్సాస్‌ ట్రస్ట్‌ శాశ్వత అనుబంధ పత్రం పొందింది. దీని ప్రకారం యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నియమ నిబంధనల ప్రకారం బోధన సిబ్బందికి వేతనాలు అమలు చేయాలి. అధ్యాపకేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి. కానీ వాటిని ఏమాత్రం పాటించకుండా 20 ఏళ్లుగా అన్యాయం చేస్తోంది. ఎన్ని సార్లు రాతపూర్వకంగా వినతులు సమర్పించినా... మాన్సాస్‌ ట్రస్ట్‌ పట్టించుకోవడం లేదు. అధ్యాపక అర్హతతో విధులు నిర్వర్తిస్తున్న వారికి యూజీసీ నిబంధనల ప్రకారం రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభైవేల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా... 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సీనియర్‌ అధ్యాపకునికి ప్రస్తుతం కేవలం రూ.25 వేల వేతనం మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేతన నిబంధనల మేరకు బోధనేతర సిబ్బందికి రూ.18 వేల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 నుంచి 10 వేల లోపు మాత్రమే ఇస్తున్నారు. 

పదవీ విరమణ ఉద్యోగులకు భోగాలు
ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నవారికి పదోన్నతులు కల్పించాల్సి వస్తుందని... అప్పటికే తమకు నమ్మకంగా ఉండి పదవీ విరమణ చేసినవారిని ఉన్నత పదవుల్లో నిలబెట్టి రూ.85 వేల నుంచి రూ.లక్ష వరకు గౌరవ వేతనాలు ముట్టజెబుతోంది. ఓ వైపు ప్రభుత్వ పింఛన్‌ పొందుతున్న వారికి మరోవైపు సంస్థ భారీ వేతనాలు ఇవ్వడంపై అనేక అరోపణలు వస్తున్నా సంస్థ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కానీ యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించమని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేస్తున్న అధ్యాపకులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నచ్చితే పనిచేయండి లేకపోతే మానేయండని హెచ్చరికలిస్తూ పరోక్షంగా భయపెడుతోంది. మొండిగా పోరాడే అధ్యాపకులను ఏమీ చేయలేక వారిని వదిలించుకోవడానికి సంబంధిత విభాగాన్ని రద్దు చేసి తమ వైఖరిని చాటుకుంటోంది.

సీనియారిటీ ఉన్నా.. దళితులకు దక్కని పదవులు
మరోవైపు సీనియార్టీ ప్రకారం ఉన్నత పదవులు దక్కాల్సిన దళిత అధ్యాపకులకు అన్యాయం జరుగుతోంది. విద్యార్థుల డిమాండ్‌ ఉన్నప్పటికీ ఆ విభాగాన్ని రద్దు చేసి పదవులకు అర్హత లేకుండా చేస్తోంది. ఉదాహరణకు కళాశాల స్థాపించినప్పటి నుంచి ఉన్న హిస్టరీ విభాగంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ అశోక్‌ అనే అధ్యాపకుడు పనిచేస్తున్నారు. పలు విద్యాధిక అర్హతలతో ఉన్న ఆయన సీనియార్టీకి కళాశాల డైరెక్టర్‌ పదవి ఇవ్వాలి. ఆయన తన సీనియార్టీని గుర్తించి యూజీసీ వేతనం ఇవ్వాలని పలుమార్లు సంస్థను కోరారు. కానీ దళితుడైన ఆయనకు డైరెక్టర్‌ పదవి ఇవ్వడానికి ఇష్టం లేక చివరికి ఆయన పనిచేస్తున్న హిస్టరీ విభాగాన్ని గత ఏడాది రద్దు చేశారు. సోషల్‌ వర్క్‌ విభాగం కూడా అదేమాదిరిగా రద్దు చేశారు. నిజానికి ప్రతి ఏడాది విద్యార్థుల డిమాండ్‌ అధికంగా ఉన్న కోర్సుల్లో ఈ రెండూ నిలుస్తున్నా... కేవలం దళితులకు ఉన్నత పదవులు ఇవ్వడానికి ఇష్టం లేకే రద్దు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

దళితునికి డైరెక్టర్‌ ఇవ్వాల్సి వస్తుందనే...
కళాశాలలో 20 ఏళ్ల సీనియార్టీతో హిస్టరీ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు రూ.25 వేలు వేతనం దాటడం లేదు. యూజీసీ వేతనాలు అమలు చేస్తే రూ.1.5 లక్షల నెలవారీ వేతనం వస్తుంది. కొన్నేళ్లుగా వేతనాలు ఇవ్వకుండా మాన్సాస్‌ సంస్థ దోచుకుంటోంది.  సీనియార్టీ ప్రకారం నాకు డైరెక్టర్‌ పదవి రావాల్సి ఉంది. దళితుడినైన నాకు ఆ పదవి ఇవ్వడానికి ఇష్టం లేక హిస్టరీ విభాగాన్ని గత ఏడాది రద్దు చేశారు.
– డాక్టర్‌ ఎస్‌.అంబేడ్కర్‌ అశోక్, కార్యదర్శి, మాన్సాస్‌ పీజీకాలేజీ టీచింగ్‌ స్టాఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌. 

మరిన్ని వార్తలు