వివక్షపై ఉద్యమం

20 Feb, 2015 02:29 IST|Sakshi
వివక్షపై ఉద్యమం

సాక్షి ప్రతినిధి, కడప : తొలి విజయం దక్కిన స్ఫూర్తితో ముందుకు సాగాలని.. ఉద్యమిస్తేనే పెండింగ్ పథకాల పురోగతి సాధ్యమని జిల్లా మేధావులు, విశ్లేషకులు పిలుపునిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా నిరసన వ్యక్తం కావడంతోనే ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్ట కోదండ రాముడి కల్యాణం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తలొగ్గారని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వాసులకు ఈ పరిణామం తొలి విజయం. అదే ఉద్యమ స్ఫూర్తి ప్రదర్శించి జిల్లా పట్ల ఉన్న వివక్షను పారదోలేందుకు రాజకీయాలకతీతంగా పెండింగ్ పథకాల సాధన కోసం నాయకులు ఉద్యమించాలని ప్రజలు కోరుతున్నారు.
 
 మూడు దశాబ్దాల క్రితం అభివృద్ధిలో పాలకుల వివక్షకు గురైన జిల్లాకు మరోమారు అలాంటి అనుభవం ఎదురవుతోంది. శరవేగంగా సాగిన అభివృద్ధి పథకాలు ఐదేళ్లుగా పెండింగ్ పథకాలుగా నిలిచిపోయాయి. మెట్ట ప్రాంతం పురోభివృద్ధికి చేపట్టిన తాగు, సాగునీటి పథకాలు ఫలాలు అందాల్సిన తరుణంలో నిరుపయోగమయ్యాయి.
 
  95 శాతం పూర్తయిన గండికోట ప్రాజెక్టు సద్వినియోగం కాలేదు. జాతికి అంకితం చేసిన బ్రహ్మంసాగర్ వివక్ష కారణంగా సకాలంలో నీరు విడుదల కాకపోవడంతో నిండుకుంది. పంటపొలాలు అటు ఉంచితే, రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు విరజిల్లుతున్న ఆర్టీపీపీకి ప్రాణప్రదమైన బ్రహ్మంసాగర్‌లో సైతం అవకాశం ఉండి ప్రభుత్వం నీరు నింపలేకపోయింది. చిత్రావతి ప్రాజెక్టుకు ‘దినదినగండం నూరేళ్ల ఆయుష్షు’ అన్నట్లుగా నీటి కేటాయింపులు ఉన్నాయి. జిల్లా మీదుగా సోమశిల ప్రాజెక్టుకు నీరు చేరుతున్నా, అక్కడి వెనుక జలాలను తాగునీటి కోసం తెచ్చుకోలేని దుస్థితి నెలకొంది. ఇలాంటి అతి ముఖ్యమైన పథకాల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా వాసులు అంటున్నారు.
 
 ఉక్కు పరిశ్రమపై మీనమేషాలు....
 రాష్ట్ర విభజన చట్టంలో ‘సెయిల్’ నేతృత్వంలో కడప గడపలో ఉక్కుపరిశ్రమ నెలకొల్పాలని నిర్ణయంచారు. మెట్ట ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు విశేషంగా యోగ్యం కానున్న ఆ పరిశ్రమ పట్ల పాలకులు మీనమేషాలు వ్యక్తం చేస్తున్నారు. సెయిల్ నిబంధనలు పెట్టిందని ఆమేరకు ఇక్కడ అలాంటి వసతులు లేవని, కుంటిసాకులు చెబుతున్నారు. ఉక్కుపరిశ్రమ సాధనే లక్ష్యంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, మేధావి వర్గాలు, సాహిత్యాభిమానులు ఏకతాటిపైకి రావాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.
 
 నిధులతో నిమిత్తం లేకున్నా....
 నిధులతో నిమిత్తం లేని పథకాలను సైతం పెండింగ్‌లో ఉంచుతున్నారు. ప్రజానీకానికి మెరుగైన సేవలు అందుబాటులోకి రాకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా చిన్నచూపు చూస్తోందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అందుకు విమానాశ్రయం నెలల తరబడి ప్రారంభం చేయకపోవడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. కడప విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుగా మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.
 
 దాంతో కేవలం ఏటీఆర్-72 సర్వీసులు (75 మంది ప్రయాణించే అవకాశం ఉన్నవి) మాత్రమే నడుస్తాయి. అవి కూడా కడప దరికి చేరకూడదనే సంకల్పం ప్రభుత్వ ముఖ్యులకు ఉన్న కారణంగా విమానాశ్రయం ప్రారంభోత్సవానికి నోచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే కలెక్టరేట్ కాంప్లెక్స్ పనులు 95 శాతం పూర్తి అయ్యాయి. అరకొర పనులే మిగిలి ఉన్నా పూర్తికాక ఏళ్ల తరబడి దిష్టిబొమ్మలా దర్శనిమిస్తోంది. ఇవన్నీ ఉపయోగంలోకి రావాలంటే ఉద్యమాలే శరణ్యమని.. ప్రతి ఒక్కరూ కదలిరావాలని మేధావులు, నేతలు కోరుతున్నారు.
 
 స్పష్టమైన వివక్ష వ్యక్తమౌతోంది..
 రాయలసీమ పట్ల పాలకులు వివక్ష స్పష్టంగా కన్పిస్తోంది. ఈ జిల్లా పట్ల మరింత అధికంగా ఉంది. తుదకు రాష్ట్ర విభజన చట్టం అమలు చేయడంలో వివక్ష చూపుతున్నారు. ఉక్కు పరిశ్రమ నెలకొల్పడంలో మీనమేషాలు ప్రదర్శిస్తున్నారు. జిల్లాకు రూ.50కోట్లు మాత్రమే కేటాయించడం తీవ్ర అన్యాయం. రాజకీయాలకు అతీతంగా అన్నీ పార్టీలు ఏకమై ఉద్యమించాలి.
 - సీహెచ్ చంద్రశేఖర రెడ్డి, రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు
 
 పోరాటాల ద్వారానే సాధించుకోవాలి..
 కృష్ణా జలాలను జిల్లాకు తీసుకరావలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీఎన్‌ఎస్‌ఎస్, ెహ చ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకాలను అమలు చేశారు. చిత్తశుద్ధితో పనులు నిర్వహించారు. ఆయన మృతితో అవన్నీ పెండింగ్‌లో పడ్డాయి. సమైక్యంగా పోరాటం చేస్తే తప్ప ఫలితం ఉండడం లేదు.
 - అమర్‌నాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 

>
మరిన్ని వార్తలు