జీరో ఎఫ్‌ఐఆర్‌పై స్పష్టమైన ఆదేశాలిచ్చాం

9 Dec, 2019 14:20 IST|Sakshi

హోంమంత్రి మేకతోటి సుచరిత

సాక్షి, అమరావతి: మహిళల రక్షణ, భద్రతకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత్ర తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు మహిళా భద్రతపై చర్చ జరిగింది. మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఆమె శాసనసభలో వివరించారు. మహిళలు, కిశోర బాలికలను చైతన్యపరిచి సాధికార పరచటానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. 11వేల గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, 3వేల వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల పదవులను నోటిఫై చేశామన్నారు. ఈ నియామకాలు ద్వారా పోలీసు సేవలు మరింత మెరుగుపడతాయన్నారు. 

మహిళలు, చిన్నారులకు మరింత రక్షణ కల్పించేందుకు ‘మహిళా మిత్ర’ ఏర్పాటు చేశామని వెల్లడించారు. యువత, బాలలకు అవగాహన కల్పించి మహిళలపై నేరాలు తగ్గించడమే లక్ష్యమన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఇద్దరు పోలీస్‌ అధికారులు, మహిళా మిత్రలను సమన్వయకర్తలుగా చేసి మహిళా మిత్ర ఉద్దేశాలు, లక్ష్యాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడం కోసం ‘సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ 9121211100’ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించటం, మహిళల్లో విశ్వాసాన్ని నింపటానికి బహిరంగ ప్రచారాలు, అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తామని సుచరిత వివరించారు. మహిళల భద్రత కోసం కఠినమైన న్యాయ చర్యలు చేయటానికి వీలుగా నేరాలపై కేసులు తక్షణ నమోదు చేయటానికి అన్ని పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు దీర్ఘకాలిక సూచనలు ఇచ్చామని తెలిపారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటానికి ఏపీ డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. మహిళలపై నేరాల పరిష్కారం కోసం ప్రత్యేక ఫాస్ట్‌ కోర్టులను 13 జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. వీటికి అదనంగా పోస్కో కేసుల పరిష్కారానికి 8 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పనిచేస్తున్నాయని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ డబ్ల్యూసీ మంత్రిత్వశాఖ మహిళా పోలీస్‌ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిందని వివరించారు. గృహహింస, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న హింస వంటివి నివేదించటం మహిళా పోలీస్‌ వాలంటీర్ల  కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో 1500 మంది మహిళా పోలీసు వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో మానవ రవాణా నిరోధక యూనిట్లు, ఏపీ మహిళాభ్యుదయం, శిశుసంక్షేమ శాఖ సభ్యులు, స్థానిక ఎన్జీవోల సభ్యుల సహకారంతో వ్యక్తుల రవాణా నిరోధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోక్సో నేరస్తులపై హిస్టరీ షీట్లు తెరవాలని, పదేపదే అదే నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను నిర్భందించాలని యూనిట్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పైలట్ విధానంలో ప్రకాశం జిల్లా పోలీస్‌ స్టేషన్లల్లో ప్రాజెక్ట్ అభయ్‌ ప్రారంభించామని సుచరిత పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా