రా..రమ్మని!

10 Jun, 2015 00:57 IST|Sakshi
రా..రమ్మని!

బీపీఎస్ కోసం ఇంటిబాట
కరపత్రాలు, సదస్సుల ద్వారా ప్రచారం
బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లకు రోజువారీ టార్గెట్లు
కార్పొరేషన్ ఖజానా నింపేందుకు కసరత్తు

 
విజయవాడ సెంట్రల్ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన కార్పొరేషన్ ఖజానా నింపుకొనేందుకు భవనాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు  2007 నుంచి ఇప్పటివరకు మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. గూగుల్ మ్యాప్, ఇంటిపన్ను రసీదులను పరిగణనలోకి తీసుకుని బీపీఎస్‌ను వర్తింపజేయాలన్న ఆలోచనకు వచ్చారు. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం నిబంధనలు గందరగోళంగా మారడంతో గృహ నిర్మాణదారుల నుంచి స్పందన కరువైంది. గడిచిన పది రోజుల్లో కేవలం 30 దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో వచ్చాయి. మరో నెలా ఇరవై రోజుల్లో గడువు పూర్తికానుంది.  పెద్దసంఖ్యలో బీపీఎస్ దరఖాస్తులు స్వీకరించాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ మేర కసరత్తు చేస్తున్నారు.

క్షేత్రస్థాయికి వెళదాం

టౌన్ ప్లానింగ్ విభాగం ఏడాదికి సగటున 2,500 ఇళ్ల ప్లాన్లు మంజూరుచేస్తోంది. 2007లో  బీపీఎస్‌కు 15,826 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 11,287 క్లియర్ చేశారు. కోర్టు కేసులు, గడువు లోపు దరఖాస్తులు అందకపోవడం వంటి కారణాలతో 4,539 దరఖాస్తులను తిరస్కరించారు. 2007 తర్వాత మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కాలంలో సుమారు 18,500 వరకు ప్లాన్లు మంజూరు చేయగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి భవన నిర్మాణాలను పరిశీలించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గృహాలకు బీపీఎస్ అని రాసి ఇంటూ మార్క్ వేస్తారు. ఆ గృహ నిర్మాణదారుడి నుంచి దరఖాస్తు అందిన వెంటనే ఇంటూ మార్క్‌ను చెరిపేసే విధంగా ప్లాన్ చేశారు. ఇలా చేయడం ద్వారా బీపీఎస్‌కు సంబంధించి గృహ నిర్మాణదారులను రమ్మని ఆహ్వానించినట్లవుతుందని టౌన్ ప్లానింగ్ అధికారులు భావిస్తున్నారు.
 
రోజుకు వంద టార్గెట్

అప్పుల ఊబిలో ఉన్న నగరపాలక సంస్థ బీపీఎస్‌పై గంపెడాశ పెట్టుకుంది. రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా కట్టింది. 1985 జనవరి 1 నుంచి  2014 డిసెంబర్ 31 వరకు నిర్మించిన భవనాలకు మాత్రమే బీపీఎస్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గూగుల్ మ్యాప్ ఆధారంగానే గృహనిర్మాణాల్లో అక్రమాలను గుర్తించాలని నిర్ణయించారు. పన్ను రసీదును పరిగణనలోకి తీసుకోవాలని బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇక వారు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి రోజుకు ఒక్కో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ కనీసం వందకు తగ్గకుండా దరఖాస్తులు స్వీకరించాలని లక్ష్యంగా  నిర్ణయించారు. నగరంలోని 14 మీ-సేవ కేంద్రాలు, మూడు సర్కిల్ కార్యాలయాలతోపాటు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో రెండు స్పెషల్ కౌంటర్లను ఏర్పాటుచేశారు. సంబంధిత పత్రాలతో గృహ నిర్మాణదారులు ఈ కేంద్రాలకు వచ్చినట్లయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు బాధ్యతను ప్రత్యేక సిబ్బందే చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.
 
ముమ్మర ప్రచారం
బీపీఎస్‌పై ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు సిటీ ప్లానర్ ఎస్.చక్రపాణి ‘సాక్షి’కి చెప్పారు. కరపత్రాలు, డివిజన్లలో సదస్సుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 16 వేల దరఖాస్తులు అందాలన్నది లక్ష్యమన్నారు. గతంలో తిరస్కరించిన దరఖాస్తుల విషయంలో ఏం చేయాలనేదానిపై ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.
 

మరిన్ని వార్తలు