సద్దుమణిగిన సరిహద్దు

28 Mar, 2020 04:02 IST|Sakshi
గంగవరం మండలంలోని సరిహద్దులో పడిగాపులు పడుతున్న మత్స్యకారులు

ఉపాధి కోసం మంగళూరు వెళ్లిన ఏపీ మత్స్యకారులు 

కరోనా నేపథ్యంలో  ఆంధ్రాలోకి వచ్చేందుకు  యత్నం 

అడ్డుకున్న పోలీసులు

ఏపీ– కర్ణాటక ప్రభుత్వాల మధ్య చర్చలతో సమసిన వివాదం

పలమనేరు/గంగవరం (చిత్తూరు జిల్లా): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఏపీలోకి అనుమతించే విషయమై తలెత్తిన వివాదం ఏపీ ప్రభుత్వం చొరవతో సద్దుమణిగింది. వారిని ఆంధ్రప్రదేశ్‌లోకి అనుమతించడానికి తమకేమీ అభ్యంతరం లేదని.. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా 14 రోజులపాటు వారిని అక్కడే క్వారంటైన్‌లో ఉంచి ఇక్కడకు పంపిస్తే మంచిదని ఏపీ ప్రభుత్వం సూచించడంతో కర్ణాటక ప్రభుత్వం అందుకు ఆమోదం తెలిపింది. ఇందుకు మత్స్యకారులు కూడా అంగీకరించటంతో సమస్య పరిష్కారమైంది.  

ఇదీ జరిగింది : మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాలకు చెందిన సుమారు 1,400 మంది మత్స్యకారులు ఉపాధి నిమిత్తం కొన్ని రోజుల క్రితం మంగళూరు హార్బర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో వీరంతా అక్కడే తలదాచుకున్నారు. గురువారం అక్కడి అధికారులు మీ ఊళ్లకు వెళ్లొచ్చని చెప్పి వారందరినీ పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం సమీపంలోని ఏపీ–కర్ణాటక సరిహద్దుకు చేర్చారు.

ఈ విషయాన్ని కర్ణాటక–ఏపీ సరిహద్దులో గస్తీ కాస్తున్న ఏపీ పోలీసులు చిత్తూరు కలెక్టర్‌ భరత్‌ నారాయణ్‌గుప్తకు తెలియజేయగా.. ఆయన కర్ణాటక అధికారులతో మాట్లాడారు. దీంతో కర్ణాటకలోని కోలారు జిల్లా కలెక్టర్‌ సత్యభామ, ఎస్పీ కార్తీక్‌రెడ్డి అక్కడకు చేరుకుని వీరిని ఎక్కడ ఉంచాలనే విషయంపై చర్చలు జరిపారు. హెల్త్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి వారందరినీ కర్ణాటకలోని ముళబాగిళు వద్ద ఉంచి.. వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల తరువాత ఏపీకి పంపిస్తామని కర్ణాటక అధికారులు చెప్పారు. ఇందుకు ససేమిరా అన్న మత్స్యకారులు తమను ఆంధ్రాలోకి పంపించాల్సిందేనంటూ భీష్మించారు. అధికారుల మాటను ఖాతరు చేయకుండా సరిహద్దు దాటి ఏపీలోకి చొరబడేందుకు యత్నించారు.  

ఫలించిన చర్చలు : పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ కర్ణాటకలోని కోలారు ఎంపీ మునస్వామి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ, ముళబాగిళు ఎమ్మెల్యే నాగేష్‌తో మాట్లాడారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు శుక్రవారం రాత్రి చర్చలు జరిపాయి. మత్య్సకారులను ఆంధ్రప్రదేశ్‌లోకి అనుమతించడానికి తమకు అభ్యంతరం లేదని.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హెల్త్‌ ప్రొటోకాల్‌ను దృష్టిలో ఉంచుకుని 14 రోజులపాటు వారిని అక్కడే క్వారంటైన్‌లో ఉంచి ఏపీకి పంపిస్తే మంచిదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మత్స్యకారులను కర్ణాటకలోనే క్వారంటైన్‌లో ఉంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఇందుకు మత్స్యకారులు కూడా అంగీకరించడంతో కర్ణాటక నుంచి ప్రత్యేక బలగాలు సరిహద్దు ప్రాంతానికి చేరుకుని వారిని ప్రత్యేక వాహనాల్లో వెనక్కి తీసుకెళ్లాయి. మత్స్యకారులను కోలార్, ముళబాగిళు ప్రాంతాలకు తరలించి అక్కడి కల్యాణ మండపాలు, పాఠశాలలు, కళాశాలల్లో కర్ణాటక ప్రభుత్వం వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తోందని చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌–2 చంద్రమౌళి మీడియాకు తెలిపారు. వారందరికీ అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు