-

కాంగ్రెస్ పిల్లిమొగ్గలు

29 Sep, 2013 01:59 IST|Sakshi
కాకినాడ, న్యూస్‌లైన్ : కాకినాడ నగర మహిళా కాంగ్రెస్ కమిటీ నియామకంపై ఆ పార్టీ పిల్లిమొగ్గలు వేసింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత ఈనెల 24న స్వయంగా జారీ చేసిన నియామక ఆదేశాలను శనివారం వెనక్కి తీసుకున్నారు. ఈ నియామకంతో జరిగిన పరిణామాలతో కాకినాడ మాజీ మేయర్ సరోజ శుక్రవారం డీసీసీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దీంతో వివాదం రాష్ట్ర కమిటీకి దృష్టికి వెళ్లింది. జిల్లాకు చెందిన కొందరు నేతలు నామాల బ్రహ్మకుమారి అధ్యక్షురాలిగా ఏర్పాటు చేసిన కాకినాడ నగర మహిళా కాంగ్రెస్ కమిటీని రద్దు చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. దానికి తలొగ్గిన లలిత ఈ నెల 24న ప్రకటించిన కమిటీని రద్దు చేస్తున్నట్టు డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లుకు లేఖ పంపారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, త్వరలోనే మరో కమిటీని ప్రతిపాదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
 పట్టుమని నాలుగు రోజులు గడవకుండానే ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇలా పిల్లి మొగ్గలు వేయడం వల్ల పార్టీ ప్రతిష్ట మంటగలుస్తుందంటూ పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఏ ప్రాతిపదికన నియామకాలు చేస్తున్నారో, ఎందుకు రద్దు చేస్తున్నారో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. గతంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సమర్థంగా పనిచేసిన బ్రహ్మకుమారిని తొలగించారన్న సమాచారం ఆ వర్గానికి మింగుడు పడడం లేదు. పీసీసీ అధ్యక్షుడిపైనా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిపైనా ఒత్తిడి తెచ్చి కమిటీని రద్దు చేయించారని తెలియడంతో ఈ వ్యవహారాన్ని మాజీ మేయర్ సరోజ వర్గీయులు అఖిల భారత మహిళా విభాగం అధ్యక్ష, ఉపాధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. 
 
 దీంతో ఢిల్లీకి చెందిన కొందరు ముఖ్యమహిళా నేతలు సరోజతో, ఇతర నేతలతో కూడా మాట్లాడారని చెబుతున్నారు. కమిటీ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని తమకు సూచించారని సరోజ వర్గీయులు అంటున్నారు. ఏదేమైనా బ్రహ్మకుమారి, ఆమెతో పాటు నియమితులైన నూతన కార్యవర్గ సభ్యులు శనివారం పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కమిటీని రద్దు చేస్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని, కాకినాడ నగరంలో పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీ విషయంలో ఆదివారం డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది. 
మరిన్ని వార్తలు