దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు

12 Dec, 2019 16:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు రానున్నాయని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీ మహిళా కమిషన్, మహితా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొని హెల్ప్‌లైన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. బాల్య వివాహాలు జరగడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఇక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు.. కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా తీసుకువచ్చిన దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు వస్తాయని, దానికి దిశ చట్టమే సంకేతమంటూ హర్షం వ్యక్తం చేశారు. యావత్‌ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దిశ ఘటనలో.. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని అందరూ స్వాగతించారన్నారు. రాష్ట్రంలో మహిళలకు మేమున్నామని భరోసా ఇస్తూ ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుని కొత్త చట్టాన్ని తీసుకురావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు.

మహిళల రక్షణ, భద్రతకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీసుకువచ్చిన దిశ చట్టం.. దేశవ్యాప్తంగా మహిళలపై దాడులను అరికట్టి, మంచి పరిణామాలు తీసుకు రావడానికి కొంతమేర కారణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు మహిళలకు రక్షణ కల్పించడంలోవిఫలమవుతున్నాయని, చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. 

దిశ చట్టాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తామని.. దిశ చట్టం ద్వారా హత్య, లైంగిక దాడి, గృహ హింస వంటి హేయమైన నేరాలు కొద్దిమేర తగ్గుతాయన్నారు. ఈ చట్టం ద్వారా నేరాలకు పాల్పడే వారికి భయం కలిగి.. నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. చిత్తూరు జిల్లా వర్షిత కేసులో సైతం ఛార్జ్ షీట్ వేసి కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 

ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని.. వారిని కించపరిచేలా పోస్టులు పెట్టి సైబర్ నేరాలకు పాల్పడే వారికి అడ్డుకునేందుకు దిశ చట్టం దోహదపడుతుందని ఆకాంక్షించారు. ప్రముఖులను సామాజిక మాధ్యమాల్లో లక్ష్యంగా చేసుకుని మానసిక వేదనకు గురిచేసే సైబర్‌ నిందితులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని తొలగించి, ఐపీ అడ్రస్‌ కనుక్కునే వరకూ తీవ్ర కాలయాపన జరిగేదని.. త్వరలో అలాంటి నేరాలకు తెరపడనుందని అన్నారు. 

దిశ చట్టంతో ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడంతో మహిళా సంబంధింత కేసులు పెండింగ్‌లో ఉండవని ఆనందం వ్యక్తం చేశారు. 'సీఎం జగన్‌ మహిళలకు అండగా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి' అని మగవారు అనుకునే పరిస్థితి రాకపోదని అన్నారు. 

మరిన్ని వార్తలు