దశ 'దిశ'లా స్పందన

13 Feb, 2020 03:31 IST|Sakshi

మూడు రోజుల్లోనే 35 వేల మంది డౌన్‌లోడ్‌ 

యాప్‌ సేవలకు యూజర్స్‌ నుంచి 5కు 4.8 స్టార్‌ రేటింగ్‌  

రోజుకు రెండు వేల మంది టెస్ట్‌ కాల్స్‌ 

ప్రమాదంలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా రూపొందిన దిశ యాప్‌

దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు డీజీపీ వెల్లడి

సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. ఈ నెల 9న ప్లేస్టోర్‌లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను 12 ఉదయం వరకు అంటే.. మూడు రోజుల్లోనే 35 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం విశేషం. అదేవిధంగా యాప్‌ సేవలను మెచ్చి గూగుల్‌ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.8 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. ఈ యాప్‌ పనిచేస్తుందో.. లేదో తెలుసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కాల్స్‌ వస్తుండటం మరో విశేషం. 9వ తేదీ నుంచి రోజూ రెండు వేల మందికిపైగా దిశ యాప్‌ ద్వారా పోలీస్‌ కమాండ్‌ రూమ్‌కు టెస్ట్‌ కాల్స్‌ చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నెల 8న రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌స్టేషన్‌తోపాటు దిశ మొబైల్‌ అప్లికేషన్‌ (యాప్‌)ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

దిశ.. పనితీరు ఇలా..
- ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ మొబైల్‌ ఫోనుల్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
- ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికే ఇంటర్నెట్‌ అవసరం. తర్వాత ఇంటర్నెట్‌ ఉన్నా, లేకున్నా మొబైల్‌ ద్వారా యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
- ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి అత్యవసర సహాయం (ఎస్‌వోఎస్‌) బటన్‌ నొక్కితే చాలు.. వారి ఫోన్‌ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్‌ రూమ్‌కు చేరతాయి. 
- ఎస్‌వోఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేసే సమయం లేనప్పుడు చేతిలోనిఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్‌ రూమ్‌కు సమాచారం చేరుతుంది. 
- ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్‌ రూమ్‌కు పంపించే వీలు ఉంది. 
ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కగానే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్‌ రక్షక్‌ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్‌ వెళ్తుంది.
- ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్‌ అమర్చిన పోలీస్‌ రక్షక్‌ వాహనాల్లోని ‘మొబైల్‌ డేటా టెర్మినల్‌’ సహాయపడుతుంది.
- ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్‌ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్‌)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. 
దిశ యాప్‌లోని ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్‌ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు. 
ఈ యాప్‌లోనే డయల్‌ 100, డయల్‌ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్‌ 100 అయితే నేరుగా కాల్‌ చేసి విషయం చెప్పాలి. డయల్‌ 112 అయితే మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా సరిపోతుంది. 
- దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 

అవగాహన కల్పిస్తున్నాం
మహిళల రక్షణ కోసం చేపట్టిన దిశ కార్యక్రమంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాం. దిశ యాప్‌నకు తక్కువ సమయంలోనే విశేష స్పందన లభిస్తోంది. యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసిన మహిళలకు ఆరు నుంచి పది నిమిషాల్లోనే తక్షణ సాయం అందిస్తున్నాం.   
  – డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు