కన్నీళ్లు తుడిచే ‘దిశ’గా..

7 Feb, 2020 13:38 IST|Sakshi

చిత్తూరులో దిశ స్టేషన్‌ సిద్ధం

వన్‌స్టాప్‌ కేంద్రంతో అనుసంధానం

మహిళలపై దాడుల కేసులన్నీ అక్కడే నమోదు

నేడు ప్రారంభం

మహిళలకు రక్షణగా ఉంటూ.. వారిపై జరిగే నేరాల్లో దర్యాప్తు, విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్షపడేట్లు చేసేలా రూపొందించిన ‘దిశ’ చట్టాన్ని అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలో దిశ మహిళా పోలీస్‌ స్టేషన్‌ను రూపొందించింది.  

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరం దర్గా సర్కిల్‌లో ఉన్న మహిళా స్టేషన్‌ను ఉన్నతీకరించి కొత్త హంగులతో దిశ స్టేషన్‌ను నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా వీడియో కాన్ఫరెన్సు (వీసీ) ద్వారా ఈ స్టేషన్‌ను శుక్రవారం ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఎలాంటి కేసులంటే..
మహిళలు, బాలికలపై జరిగే అన్ని ఘటనలపై దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యొచ్చు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, లైంగిక దాడులు, అఘాయిత్యం, వేధింపులు, యాసిడ్‌ దాడులు, అక్రమ రవాణా, ప్రేమపేరిట మోసాలు, కుటుంబ కలహాలు.. ఇలా మహిళలకుఎదురయ్యే ఇబ్బందులపై దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఎక్కడ నేరం జరిగినా దిశ స్టేషన్‌ను ఆశ్రయించవచ్చు. బాధిత మహిళల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదుచేసిన తరువాత పోలీసులు వారం రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి న్యాయస్థానానికి చార్జ్‌షీట్‌ దాఖలుచేస్తారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన ఆధారాలు లభిస్తే వారం రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి, 14 రోజుల్లో న్యాయస్థానం ద్వారా విచారణ పూర్తయ్యేలాచేసి మొత్తం.. 21 రోజుల్లో శిక్షపడేలా చూస్తారు. అలాగే పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటిని కూడా ‘పోక్సో’ చట్టం కిందకు తీసుకొచ్చి 21 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తిచేసేలా దిశ చట్టంలో సవరణలు చేశారు. మహిళలపై లైంగిక దాడుల్లో దిశ చట్టం ప్రకారం మరణశిక్ష... పోక్సోలో గరిష్టంగా జీవితఖైదు పడేలా చేస్తారు.

వన్‌స్టాప్‌తో సంధానం
దిశ పోలీస్‌ స్టేషన్‌కు అనుగుణంగా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా వన్‌స్టాప్‌ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా చివరిదశలో ఉన్నాయి. దిశ, వన్‌స్టాప్‌ కేంద్రం ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తాయి. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లలేని బాధితులు వన్‌స్టాప్‌ సెంటర్‌కు వచ్చి వారి బాధను ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు. బాధితురాలికి తొలుత కౌన్సెలింగ్‌ ఇచ్చి..  అవసరమైతే వైద్యసేవలు అందించి  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, ఆమె ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండడానికి వసతి కల్పిస్తారు. నేరం దిశ చట్టం కిందకు వస్తే 21 రోజుల్లో దర్యాప్తు, కోర్టులో ట్రయల్‌ పూర్తిచేసి శిక్ష పడేందుకు ఉచిత న్యాయవాదిని కూడా నియమిస్తారు. ఇక్కడ స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులతో పాటు పోలీసుశాఖ నుంచి ముగ్గురు, స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వాహకులు, వైద్యులు, లీగల్‌ కౌన్సెలర్‌తో ఉంటారు.

పూర్తిస్థాయిలో సిబ్బంది
దిశ చట్టం ప్రకారం స్టేషన్‌లో నమోదయ్యే కేసుల విచారణ, సాక్ష్యాల సేకరణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది నియామకం కోసం పోస్టులు కూడా మంజూరుచేసింది. ఇద్దరు డీఎస్పీలు, ఎస్‌ఐలు –5, ఏఎస్‌ఐ –2, హెడ్‌కానిస్టేబుల్‌–6, కానిస్టేబుల్‌–19, సైబర్‌ అనాలసిస్, హోంగార్డులు, డ్రైవర్లు, సహాయకులు కింద ఎనిమిది పోస్టులు మంజూరయ్యాయి. కేసుల విచారణ ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానంలో విచారణ జరగేప్పుడు ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను సైతం నియమించడానికి ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం మంజూరుచేసిన పోస్టుల్లో కొన్ని ఇప్పటికే భర్తీకాగా మరికొన్నింటిని వీలైనంత త్వరగా భర్తీచేయనున్నారు.  

ధైర్యంగా రండి
మహిళలు ఎక్కడైనా ఇబ్బందులకు గురైనా, దాడులు జరిగినా వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు రండి. మావాళ్లు స్పందిస్తారు. మహిళలపై నమోదయ్యే కేసుల్లో దిశ చట్టం పరిధిలోకి వచ్చేవాటిలో నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత 21 రోజుల్లో నిందితులకు శిక్షపడేలా చేస్తాం. అప్పటివరకు కూడా నమోదయ్యే కేసులను సైతం టాప్‌ ప్రియారిటీగా పరిగణించి వేగవంతంగా దర్యాప్తు పూర్తిచేసి నిందితులకు శిక్షపడేలా చేస్తాం. ఆపదలో ఉన్నప్పుడు సాయంకోసం డయల్‌–100, 181, పోలీస్‌ వాట్సాప్‌ : 9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వండి.    – ఎస్‌.సెంథిల్‌కుమార్,    ఎస్పీ, చిత్తూరు

మరిన్ని వార్తలు