ప్రతి జిల్లాలో ‘దిశ’ ప్రత్యేక కోర్టు

4 Jan, 2020 05:22 IST|Sakshi

జిల్లాకో ప్రత్యేక మహిళా పోలీస్‌ స్టేషన్‌

బోధనాస్పత్రుల్లో మెడికల్‌ సెంటర్‌

ఆరు గంటల్లో వైద్య నివేదిక.. 21 రోజుల్లో శిక్ష 

ఈనెల 7 నుంచి అందుబాటులోకి ‘దిశ’ యాప్‌ 

‘దిశ’ చట్టం పరిరక్షణ ప్రత్యేక అధికారి కృతికా శుక్లా వెల్లడి

సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ–2019’ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ చట్టం పరిరక్షణ ప్రత్యేకాధికారి కృతికా శుక్లా తెలిపారు. ఇందుకోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు, ప్రత్యేక మహిళా పోలీస్‌ స్టేషన్, బోధనాస్పత్రుల్లో వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఆస్పత్రుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించారన్నారు.

చట్టం అమలుకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనతోపాటు సిబ్బంది నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదలవుతుందని వెల్లడించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి, సిబ్బందిని కూడా నియమిస్తామని తెలిపారు. అలాగే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బాధితురాలు ఆస్పత్రిలో చేరిన ఆరు గంటల్లోనే వైద్య నివేదికలు వచ్చేలా చూస్తామని చెప్పారు. ఈనెల 7 నుంచి ‘దిశ యాప్‌’ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, కాల్‌ సెంటర్‌ కూడా ప్రారంభిస్తామని వివరించారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జనవరి నెలను ‘దిశ’ మాసంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నెలాఖరు నాటికల్లా దిశ చట్టం అమలులోకి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిర్భయ చట్టం కంటే ఈ దిశ చట్టం ఎంతో పటిష్టమైనదని చెప్పారు. దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించాల్సి ఉందని చెప్పారు. వైఎస్సార్‌ కిశోరి వికాస పథకం కింద ప్రాథమిక స్థాయి నుంచే వ్యక్తిగత రక్షణ (సెల్ఫ్‌ డిఫెన్స్‌)పై అవగాహన కల్పిస్తామని కృతికా శుక్లా తెలిపారు. 

మరిన్ని వార్తలు