దుర్గగుడిలో పోలీసుల అత్యుత్సాహం

14 Oct, 2018 11:04 IST|Sakshi
చైర్మన్‌ గౌరంగబాబు

విజయవాడ: దుర్గగుడిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంద్రకీలాద్రిపై ధర్మకర్తల మండలి చైర్మన్‌ గౌరంగబాబుకు అవమానం జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన గౌరంబాబును పోలీసులు అడ్డుకున్నారు. ;పోలీసుల చర్య వల్ల ఆయన కుటుంబంతో సహా అరగంటపాటు గేటు ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆలయ అధికారుల జోక్యంతో పోలీసులు లోనికి అనుమతించారు. కొండపైన ఉన్న తన కార్యాలయానికి వెళ్తుండగా మరోసారి పోలీసులు చైర్మన్‌ను అడ్డుకున్నారు.దీంతో మనస్తాపానికి గురైన చైర్మన్‌ వెనుదిరిగి పోయారు. ఈ ఘటనపై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని చైర్మన్‌ తెలిపారు. పోలీసుల వల్ల సామాన్య భక్తులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తుల కోసం తాత్కాలిక డార్మెటరీల ఏర్పాటు
 దుర్గమ్మ దర్శనం కోసం వస్తున్న భక్తులను మున్సిపల్‌ కార్యాలయం వద్ద దశల వారీగా పోలీసులు అనుమతిస్తున్నారు. భక్తులు వేచి ఉండేందుకు తాత్కాలిక డార్మెటరీలను ఏర్పాటు చేశారు. ఒకేసారి భక్తులు క్యూలైన్లలోకి వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలతో క్యూలైన్లు, భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్నారు.

ఆ అధికారిని గుర్తించాం: సీపీ

మూలా నక్షత్రం సందర్భంగా కొండపైకి వాహనాలను అనుమతించటం లేదని సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. పాలక మండలి సభ్యులకు చెందిన నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చామని వెల్లడించారు. గత రాత్రి చైర్మన్‌ గౌరంగ్‌ బాబును ఆపేసిన పోలీసు అధికారిని గుర్తించామని, బందోబస్తు నుంచి ఆ అధికారిని తప్పించామని చెప్పారు. జరిగిన దానికి చింతిస్తున్నామని వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు లక్షా అరవై వేల మంది ఉదయం 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకున్నారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు